శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (14:53 IST)

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు - సీఆర్పీసీ 91 సెక్షన్ కింద..

cbi -kavitha
భారత్ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్సీ కె.కవితకు సీబీఐ అధికారులు మరోమారు నోటీసులు జారీచేశారు. ఈ దఫా సీఆర్పీసీ 160 కింద కాకుండా, సీఆర్పీసీ 91 కింద సీబీఐ అధికారులు ఈ నోటీసు జారీ చేయడం గమనార్హం. 
 
సీఆర్పీసీ 160 కింద నోటీసు జారీచేస్తే విచారణ జరిపే వ్యక్తి ఇష్టానుసారం వారి నివాసంలోనే విచారణ జరుగుతుంది. అలాగే, కేవలం ఒక సాక్షిగా మాత్రమే ప్రశ్నిస్తారు. అదే సీఆర్పీసీ 91 కింద నోటీసు జారీ చేసి విచారణ అంటే మాత్రం మాత్రం సీబీఐ చెప్పిన చోటికి విచారణ ఎదుర్కొనే వ్యక్తి వెళ్ళాల్సి ఉంటుంది. అపుడు విచారణ మరింత లోతుగా జరుగుతుంది. 
 
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కె. కవితకు కూడా సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె పాత్రపై నిగ్గు తేల్చేందుకు సీబీఐ అధికారులు ఆమె వద్ద ఆదివారం ఏడున్నర గంటల పాటు విచారణ జరిపారు. ఈ విచారణలో ఆమెను ఒక సాక్షిగా మాత్రమే పరిగణించి విచారించారు. సీబీఐ అధికారులు అనేక ఆధారాలు చూపించి కవిత వద్ద సమాధానాలు రాబట్టారు. ఈ నేపథ్యంలో మరోమారు ఆమెకు నోటీసులు జారీ చేశారు.
 
తాము చెప్పిన చోటికి విచారణకు హాజరుకావాలంటూ తాజాగా ఇచ్చిన నోటీసుల్లో సీబీఐ అధికారులు పేర్కొన్నారు. పైగా, తాము అడిగిన పత్రాలను విచారణకు తీసుకుని రావాలని కోరారు. కేసుకు సంబంధించి మరింత సమాచారం కావాలని, తాము అడిగిన పత్రాలను, సాక్ష్యాలను ఇవ్వాలని ఆదేశించారు. విచారణ తేదీ, స్థలాన్ని త్వరలోనే మెయిల్ చేస్తామని అందులో పేర్కొన్నారు.