రేవంత్ రెడ్డి వర్సెస్ మల్లారెడ్డి : బస్తీమే సవాల్ అంటూన్న నేతలు
తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి నియమితులైన తర్వాత ఆ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా, కాంగ్రెస్ దూకుడు దెబ్బకు అధికార తెరాస నేతలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఇందులోభాగంగా తెరాస నేత, ఎమ్మెల్యే మల్లారెడ్డి తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డిని విమర్శించారు.
'నువ్వు అబద్ధాలు, బ్లాక్‌మెయిల్ వ్యవహారాల్లో నంబర్ వన్ కదా. రేపు నేను నా మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. దమ్మూ ధైర్యం ఉంటే నువ్వు పీసీసీ చీఫ్, ఎంపీ పదవులకు రాజీనామా చేస్తావా' అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సవాల్ విసిరారు.
నువ్వు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇప్పుడు, రేపు, రెండేళ్లు ఆగు అని సవాల్ చేసుడు కాదు.. దమ్ముంటే ఇప్పుడు పోటీ చేసి గెలిచి ట్రైలర్ చూపించు. ఓడినోళ్లు ముక్కు నేలకు రాసి ఇంటికి పోవాలేఅని మల్లారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మల్లారెడ్డి బుధవారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఆయన పార్లమెంటులో నా కాలేజీ మీద ప్రశ్న అడిగాడు. నేను మచ్చలేని మహారాజును.. తప్పు చేయకుండా రూపాయి రూపాయి కష్టపడి సంపాదించా. నీలాగా బ్లాక్‌మెయిల్, సమాచార హక్కు చట్టం అడ్డు పెట్టుకుని అ క్రమాలు చేయలేదు.
పాలు, పూలు అమ్ముడు తప్పా. నన్ను బ్రోకర్, జోకర్ అన్నందుకే స్పందిస్తున్నా అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. అంతకుముందు రేవంత్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్‌తో పాటు తెరాస నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెల్సిందే.