మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (21:24 IST)

తెలంగాణ కొత్త గవర్నర్ తమిళసై... కెసిఆర్‌కి కిరికిరేనా?

టార్గెట్ తెలంగాణాలో భాగంగా బిజెపి మరో అడుగు వేసింది. తెలంగాణాలో బిజెపి పార్టీ పటిష్టం చేయడం లక్ష్యంగానే గవర్నర్ నియామకాలు జరిగాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి కంట్లో నలుసులుగా కొత్త గవర్నర్ వ్యవహారం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. 
 
సుధీర్ఘ కాలం గవర్నర్‌గా పనిచేసిన నరసింహన్ శకం ముగిసింది. తెలంగాణా ప్రభుత్వంతో కెసిఆర్‌తో సఖ్యతగా మెలిగారు నరసింహన్. కొత్త గవర్నర్ రాకపై చర్చ మొదలైంది. తెలంగాణా ఉద్యమ సమయంలో నరసింహన్ తెలంగాణా రాష్ట్ర గవర్నర్‌గా వచ్చారు. శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని అప్పట్లో కేంద్రం ఆయన్ను తెలంగాణాకు పంపించింది. 
 
కేంద్రంలో ప్రభుత్వం మారినా నరసింహన్ కొనసాగారు. రాష్ట్ర వ్యవహారాల్లో కూడా కేంద్రంలో ఉన్న బిజెపి సర్కార్ పెద్దగా తలదూర్చలేదు. అయితే రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక బిజెపి హైకమాండ్ తెలంగాణాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అమిత్ షా స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు.
 
తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా గవర్నర్ మార్పు జరిగిందన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఇకపై తెలంగాణా సర్కార్ పని నల్లేరుపై నడక అన్న ప్రచారం జరుగుతోంది. క్రియాశీల రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని తెలంగాణా గవర్నర్‌గా పంపిస్తున్నారంటే పార్టీ బలోపేతానికేనన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. కొత్త గవర్నర్‌గా వస్తున్న సౌందర్ రాజన్ తమిళనాడు బిజెపి అధ్యక్షురాలిగా ఉన్నారు. రీసెంట్‌గా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరుణానిధి కుమార్తె కనిమొళిపై పోటీ చేశారు.
 
తమిళనాడు లాంటి రాష్ట్రంలో బిజెపి బలోపేతం కూడా కృషి చేశారు సౌందర్ రాజన్. చెప్పుకోదగ్గ స్థాయిలో సభ్యత్వం చేయించారు. అక్కడి సమస్యలపై తన పోరాటం చేశారు. కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చి బిజెపిలో అంచెలంచెలుగా ఎదిగారు. దీన్నిబట్టి ఆమె సామర్థ్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సౌందర్ రాజన్ కామ్‌గా వచ్చి గవర్నర్‌గా ఉంటారంటే అనుమానమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.