సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2019 (13:38 IST)

గుట్టపైకి తీసుకెళ్లి గుట్టుచప్పుడుకాకుండా చంపేశాడు..

ప్రేమించిన అమ్మాయిని వదిలించుకునేందుకు ఓ ప్రేమికుడు అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. ఏకాంతంగా గడుపుదామని నమ్మించి తన ప్రియురాలిని జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లి గుట్టుచప్పుడుకాకుండా చంపేశాడు. ఈ దారుణం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ మండలంలోని కుప్పినకుంట్ల గ్రామానికి చెందిన కావిటి తేజస్విని (20), సత్తుపల్లికి చెందిన నితిన్‌లు గంగారంలోని సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్‌ కళాశాలో పాలిటెక్నిక్‌ చదువుతూ వచ్చారు. ఈ క్రమంలో వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. పాలిటెక్నిక్‌ తర్వాత నితిన్‌ ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో చేరగా, తేజస్విని కొన్ని సబ్టెక్టు తప్పడంతో ఇంట్లోనే ఉంటూ వచ్చింది. 
 
ఈ నేపథ్యంలో ప్రియుడుని ఒంటరిగా విడిచివుండలేని తేజస్విని.. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా నితిన్‌ను ఒత్తిడిచేయసాగింది. దీంతో ఆమెను వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు. ఇందులోభాగంగా ఆదివారం సాయంత్రం తేజస్వినిని నితిన్‌ తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి సమీపంలోని గుట్టపైకి తీసుకువెళ్లాడు. 
 
అక్కడ ఆమెను చంపిపడేశాడు. కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు తేజస్విని కాల్‌డేటాలో నితిన్‌ నంబర్‌ గుర్తించారు. అతను ఖమ్మం వసతి గృహంలో ఉంటున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా తానే చంపేసినట్లు అంగీకరించాడు. దీంతో అతన్ని అరెస్టు చేసి ఘటనా స్థలి నుంచి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.