ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 5 మార్చి 2020 (05:35 IST)

యాదాద్రిలో వైభవంగా తిరుకల్యాణోత్సవం

యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజు వైభవంగా జరిగాయి. తిరుకల్యాణం మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

భక్తులు వీక్షించేందుకు కొండకింద కల్యాణం నిర్వహించనున్నారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ముందుగా బాలాలయం మండపంలో స్వామి వారిని హనుమంత వాహనంపై రామావతారంలో విహరింపజేశారు.

అనంతరం గజవాహనంపై స్వామి వారిని ఊరేగించి తిరుకల్యాణ మహోత్సవం ప్రారంభించారు. ఆలయం పునర్నిర్మాణ పనుల వల్ల స్థలభావం కారణంగా రాత్రి ఎనిమిది నుంచి పది గంటల వరకు భక్తులు వీక్షించేందుకు కొండకింద పాత హైస్కూల్ గ్రౌండ్‌లో కల్యాణం నిర్వహించనున్నారు.

రాత్రి నిర్వహించనున్న కల్యాణం సదర్భంగా ముగ్గురు ఏసీపీలు, ముగ్గురు సీఐలు, 16 నంది ఎస్సైలు, 24 మంది ఎస్సైలు, 54 మంది హెడ్ కానిస్టేబుల్స్, మరో 24 మంది కానిస్టేబుల్స్‌తో బందోబస్తు ఏర్పాటు చేశారు.

దాదాపు 10వేల మంది తిలకించేలా గ్రౌండ్‌ను సిద్ధం చేశారు. వీవీఐపీ, వీఐపీల, మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.