విద్యా వ్యవస్థపై 'కరోనా' ప్రభావం
విద్యావ్యవస్థపై కరోనా ప్రభావం పడింది. తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి నిరోధించే క్రమంలో.. ఈనెలాఖరు వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తరగతులు మాత్రమే రద్దు అవుతాయి. పరీక్షలు యాథాతథంగా కొనసాగనున్నాయి.
రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు తదితర అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలను ఈనెలాఖరు వరకు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కేవలం తరగతులు మాత్రమే రద్దు కానున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న, జరగబోయే పబ్లిక్ పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయి. మొత్తం 15 రోజులపాటు తరగతులు రద్దు చేసినా పాఠశాల విద్యలో భాగమైన ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రం పునశ్చరణ తరగతులపైనే ప్రభావం పడుతుంది.
ఆ తరగతులకు ఫిబ్రవరికే సిలబస్ పూర్తయినందున ఈ నెల మొత్తం పునశ్చరణ, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సి ఉంది. తాజా నిర్ణయంతో పునశ్చరణ తరగతులు జరగవు. సర్కారు బడుల్లో ఈనెల 31న వరకు మధ్యాహ్న భోజనం కూడా బంద్ కానుంది. స్పష్టత లేదు.. డిగ్రీ సిలబస్ ఇప్పటివరకు 60 శాతం వరకే పూర్తయింది.
ఈనెలాఖరు వరకు తరగతులు రద్దు చేసినా ఏప్రిల్‌లో అదనపు తరగతులు నిర్వహించి పరీక్షలు జరుపుతారా? లేక కొంత పాఠ్య ప్రణాళికను తగ్గించి అంతవరకే పరీక్షలు ఉంటాయా? అన్న దానిపై స్పష్టత రాలేదు. ఒకవేళ సిలబస్ తగ్గిస్తే పీజీలో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆచార్యులు చెబుతున్నారు.
పరీక్షలను 10 రోజులు వాయిదా వేస్తే... మళ్లీ జవాబుపత్రాల మూల్యాంకనం ఆలస్యమవుతుంది. అప్పుడు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు గత ఏడాది మాదిరిగా సమస్య అవుతుందని భావిస్తున్నారు. దీనిపై ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఓయూ పరీక్షల విభాగం కంట్రోలర్ ఆచార్య శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. బిట్స్ మూసివేత కరోనా నేపథ్యంలో బిట్స్‌ను కూడా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.
మంగళవారం నుంచి హాస్టళ్లు కూడా ఉండవని, విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించింది. దాంతో విద్యార్థులు సొంతూర్లకు పయనమవుతున్నారు. శిక్షణ తరగతులు ఎలా? ఈనెల 16న ఇంటర్ ఎంపీసీ, బైపీసీ వార్షిక పరీక్షలు పూర్తవుతాయి. జేఈఈ మెయిన్ చివరి విడత పరీక్ష ఏప్రిల్ 5, 7, 8, 9, 11 తేదీల్లో జరుగుతాయి. అందుకే ఒక్క రోజు వ్యవధి లేకుండా కార్పొరేట్, మరికొన్ని ప్రైవేట్ కళాశాలల్లో ఎంసెట్, జేఈఈ మెయిన్, అడ్వాన్సుడ్ శిక్షణ మొదలవుతుంది.
పదుల సంఖ్యలో అకాడమీలు షార్ట్ టర్మ్ కోచింగ్ పేరిట కోచింగ్ తరగతులు నిర్వహిస్తాయి. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఇప్పుడు వాటిని నిర్వహిస్తారా? రద్దు చేస్తారా? అన్నది తేలాల్చి ఉంది. ‘ తాజా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు ఇళ్లకు వెళ్లి చదువుకోవచ్చని, తాము జరిపేది గ్రాండ్ టెస్టులే అయినందున ఆన్‌లైన్‌లో రాసేలా చర్యలు తీసుకున్నాం’ అని ఓ కార్పొరేట్ కళాశాలల జేఈఈ శిక్షణ డీన్ చెప్పారు. అధ్యాపకులతో వీడియోలు తయారు చేయించాం కాబట్టి వాటిని కూడా ఆన్‌లైన్‌లో చూడొచ్చని ఆయన తెలిపారు.