మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (08:03 IST)

కరోనా నియంత్రణలో తెలంగాణ సర్కార్ ఘోర వైఫల్యం: సీఎల్పీ నేత భట్టి

కరోనా నియంత్రణలో, వైద్య సదుపాయాల కల్పనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కరోనా విషయంలో ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసిందన్న ఆయన.. సీఎం కేసీఆర్ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు.

బతికిన వాడు బతుకుతాడు.. చనిపోయిన వారు చనిపోతారు అన్న చందంగా ప్రభుత్వ వైఖరి ఉండటం సబబు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణకై సీఎల్పీ తరపున అనేక సలహాలు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని వ్యాఖ్యానించారు. 
 
సీఎల్పీ బృందం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల సందర్శన యాత్రలో భాగంగా.. ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి తన యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా భద్రాచలం ఏరియా ఆసుపత్రిని సందర్శించిన సీఎల్పీ బృందం.. అక్కడ కరోనా రోగులకు అందుతున్న చికిత్స వివరాలపై ఆరా తీసింది.

ఆసుపత్రిలో వైద్య సిబ్బంది లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించింది. కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటాన్నమని చెబుతున్న ప్రభుత్వ మాటల్లో డొల్లతనాన్ని.. ఇక్కడి వాస్తవ పరిస్థితులు కళ్ళకు కడుతున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

మొత్తం 205 మంది వైద్యులు, ఇతర సిబ్బంది పని చేయాల్సిన భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో కేవలం  61 మంది మాత్రమే పని చేస్తుండగా.. 144 పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం ఎలా అందుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు.

జిల్లా కేంద్రంలోనే ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉంటే ఇతర పట్టణాలు, మారుమూల గ్రామాల్లో వైద్య సదుపాయాల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని ఆయన అన్నారు. 
 
కనీస సదుపాయాలు, వైద్యసిబ్బందిని ఏర్పాటు చేయకుండా కరోనా రోగులకు మెరుగైన వైద్యం ఎలా సాధ్యం అవుతుందని భట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైద్యంపై అన్నీ అవాస్తవాలు చెబుతోందనటానికి ఇంతకు మించి నిదర్శనం, ఆధారాలు ఏం కావాలని నిలదీశారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రి పరిధిలో 400 మంది కరోనా రోగులు చికిత్స పొందుతుండగా.. మరో 600 మందికి పైగా వివిధ ప్రాంతాల్లో హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నారని.. వీరందరికీ సరైన వైద్య సదుపాయం నేటికీ  అందటం లేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 

సామాన్యులతో పాటు సాక్షాత్తూ ఇదే ఆసుపత్రిలో సేవలు అందించే డీఎంహెచ్‌ఓ, స్థానిక మాజీ శాసన సభ్యుడు సున్నం రాజయ్యతో పాటు పాత్రికేయులు సైతం కరోనా బారిన పడి ప్రాణాలు వదలటం దారుణమని.. వీరందరి మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని.. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఎక్స్ గ్రేషియా చెల్లించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

కరోనా బారినపడిన తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా వైద్య చికిత్స అందించాలని, అది లేని వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని భట్టి తెలిపారు. 
 
అదే విధంగా... కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు.

ప్రైవటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు కనీస ఛార్జీలను ప్రభుత్వమే నిర్ణయించాలని.. వాటిని మించి వసూలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని,  ప్రైవేటు ఆసుపత్రుల్లో 50 శాతం పడకలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని.. దీనికై ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని భద్రచాలం పర్యటనలో భాగంగా భట్టి ప్రభుత్వాన్ని కోరారు. ప్రైవేటు హోటల్స్‌లో ఉన్న సగం రూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని క్వారంటైన్ సెంటర్లుగా వినియోగించాలని కోరారు. 
 
కోవిడ్ నిబంధనల ప్రకారం.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యేలు పీపీఈ కిట్లు ధరించి ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి వెంట స్థానిక శాసన సభ్యులు పొడెం వీరయ్య,  ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.