శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (05:28 IST)

నేటి నుంచి తెలంగాణ నేతలు కరోనా సమస్యల పరిశీలన

కరోనా వ్యాధితో తెలంగాణ ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలన ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువచ్చేందుకై.. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో యాత్ర చేపడుతున్నామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరియు సీఎల్పీ బ్రుందం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ రాష్ట్ర వ్యాప్త యాత్రను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్టు ఆయన వివరించారు.

ఈ యాత్రలో భాగంగా 33 జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ సీఎల్పీ బ్రుందం సందర్శిస్తుందన్న ఆయన.. వచ్చే నెల 7న జరిగే అసెంబ్లీ సమావేశాల్లోగా యాత్రను ముగించి ఓ నివేదికను రూపొందిస్తామని చెప్పారు. కరోనా మహమ్మారితో ప్రజలు పడుతున్న కష్టాలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకురావటమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమన్న భట్టి.. దీనికై మీడియా ప్రతినిధుల సహకారాన్ని కోరారు.

ప్రభుత్వం అవలంభిస్తున్న అస్తవ్యస్థ విధానాల వల్ల కరోనా  రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వీరి పరిస్థితి ఘోరంగా ఉందని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే బాత్ రూమ్ ఉన్న ఇళ్ళలో ఉంటున్న కరోనా రోగులు.. వారి కుటుంబ సభ్యులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి సమస్యలను పట్టించుకోకుండా మొక్కుబడి ప్రకటనలకు పరిమితం అవుతోందని భట్టి విమర్శించారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని,  బాధితులకు మెరుగైన ఉచిత వైద్యాన్ని అందించాలని మరోసారి డిమాండ్ చేశారు. 
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 6 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోతోందన్న భట్టి.. గణాంకాలతో సహా అప్పుల లెక్కలను వివరించారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు, కార్పొరేషన్లనకు ప్రభుత్వ బ్యాంకు గ్యారంటీల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేస్తోందన్నారు.

ఈ అప్పులు రాబోయే రోజుల్లో తీర్చలేని భారంగా మారతాయని ..జీతాలు, పెన్షన్లు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు చేస్తున్న అప్పులను తీర్చటానికి మద్యం, పెట్రోల్ ధరలను పెంచుతోందన్న భట్టి.. పెట్రోల్, డీజిల్ ధరలు తెలంగాణలో 150 రూపాయలు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని ఎద్దేవా చేశారు.

మద్యం ధరలను సైతం యధేచ్ఛగా పెంచుతున్న ప్రభుత్వం.. పేదల రక్తాన్ని తాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డగోలు అప్పులు తీర్చటానికి ప్రభుత్వం పెట్రోల్, మద్యం ధరలను పెంచుతున్న విషయాన్ని ప్రజలంతా గమనించాలని ఆయన మరోసారి విజ్ణప్తి చేశారు.