గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 మే 2021 (14:57 IST)

మిస్టర్ ఈటల... వెంట్రుక కూడా పీకలేవ్.. జాగ్రత్త : మంత్రి గంగుల వార్నింగ్

తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ఆ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మిస్టర్ ఈటల... వెంట్రుక కూడా పీకలేవు అంటూ వ్యాఖ్యానించారు. 
 
తాను వ్యక్తిగతంగా దిగితే తట్టుకోలేవంటూ మాజీ మంత్రి ఈటల హెచ్చరించిన కొన్ని గంటలపై మంత్రి గంగుల కమలాకర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈటలకు ఏమాత్రం ఆత్మగౌరవం ఉంటే, వెంటనే ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించాలన్నారు. ఆయన బెదిరిస్తే భయపడేవాడు ఎవడూ లేడన్నారు. 
 
టీఆర్ఎస్‌లో ఉన్నారు కాబట్టి ఇన్నిరోజులు గౌరవించామని.. బిడ్డా గిడ్డా అంటే అంతేస్థాయిలో సమాధానం ఇవ్వగలమని అన్నారు. '1992 నుంచి గ్రానైట్ బిజినెస్ చేస్తున్నాను. నీలాగ అసైన్డ్ భూములను ఆక్రమించుకోలేదు. అసైన్డ్ అని తేలాక కూడా ఇంకా ఎందుకు పట్టుకు వేలాడుతున్నావు. 2004లో దివంగత నేత ఎమ్మెస్సార్ దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు క్రమబద్దీకరణకు ప్రయత్నిస్తే... ఆయన కుదరదని తేల్చి చెప్పారు. 
 
2018లో నా ఓటమిని కోరుకున్న వ్యక్తి ఈటల. గెలిచినప్పటి నుంచి అసహనంతో ఉన్నాడు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు నాతో మాట్లాడలేదు. తెరాస పతనాన్ని కోరుకున్న వ్యక్తి ఈటల. సజీవ సాక్ష్యాలివి. దాస్తే దాగేవి కావు. ఇవాళ ఆయన అన్నదానికంటే ఎక్కువగా అనగలను. తట్టుకోలేవు. భయంకరంగా ఉంటుంది. పార్టీని కాపాడుకుంటాం. వ్యక్తిగతంగా మాట్లాడితే తట్టుకోలేవు. 
 
సివిల్ సప్లై స్కీమ్ పెండింగ్‌లో ఉంది. నా పరిధిలోకి రాదని సీఎం దృష్టికి తీసుకు వెళ్లలేదు. జిల్లా బొందలగడ్డ అయ్యిందంటున్నావు.. గ్రానైట్ క్వారీల లెక్కలు తీయి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. సీబీఐకి రాయి. నా గ్రానైట్ కంపెనీలపై సమైక్యాంధ్రలో విజిలెన్స్ కమిటి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చింది. హుజూరాబాద్‌లో నువ్వు శూన్యంలో ఉన్నావు. మా పార్టీ బలంగా ఉంది. నీలా తిన్నింటి వాసాలు లెక్కపెట్టం. 
 
సాగర్ అసెంబ్లీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు పెట్టి కొన్నామా... తెలంగాణ ప్రజలు అమ్ముడుపోతావని అంటావా... మాకు పదవులు ముఖ్యం కాదు. కేసీఆర్ అధికారంలో ఉంటే చాలనుకుంటున్నాం. టీఆర్ఎస్‌కు ఓటేస్తే అమ్ముడు పోయినట్టా... నువ్వు సంస్కారం తప్పుతున్నావు. మేము ఆచితూచి మాట్లాడుతున్నాము. ఏం చేస్తావు.. వాట్సాప్, యూట్యూబ్‌లలో తిట్టిస్తావు అంతే కదా. ఇదిగో వెంట్రుక కూడా పీకలేవు' అంటూ గంగుల కమలారకర్ వార్నింగ్ ఇచ్చారు.