జనాలకు ఎన్నికల ముందు మంచి చేస్తే చాలు...: తెరాస ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్రంలోని అధికార తెరాసకు చెందిన ఎమ్మెల్యే, మాజీమంత్రి లక్ష్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మంచి చేస్తే త్వరగా మరిచిపోతారన్నారు. వారు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే పనులు చేయకుండా ఉండటమే ఉత్తమమన్నారు. అందువల్ల సంక్షేమపథకాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మహబూబ్‌నగర్‌లో ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటు ఉందన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని సీఎంను కోరాలని ఉందన్నారు. 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్న విషయాన్ని కూడా మర్చిపోయారన్నారు. అందుకే రోజుకు 3 లేదా 4 గంటల పాటు మాత్రమే విద్యుత్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరాలనుకుంటున్నానని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రస్తుతం నిలిపివేసి.. ఎన్నికలకు ఏడాది ముందు మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
జనాలను మంచివారు అనాలో, లేక అమాయకులు అనాలో అర్థం కావడం లేదని లక్ష్మారెడ్డి చెప్పారు. సంక్షేమ పథకాలను ఇవ్వడం కూడా అనవసరమని... ఎన్నికలకు ఏడాది ముందు మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందని అన్నారు. జడ్చర్లలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రకృతి వనం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.