దేశంలో కోటికి చేరువలో కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటికి చేరువగా వచ్చాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన తాజా బులిటెన్ మేరకు... గత 24 గంటల్లో 22,065 మందికి కరోనా నిర్ధారణ అయింది. గత ఐదు నెలల కాలంలో ఒక రోజు నమోదైన అతి తక్కువ కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. ఈ కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 99,06,165కు చేరింది. ఇక గత 24 గంటల్లో 34,477 మంది కోలుకున్నారు.
గడచిన 24 గంటల సమయంలో 354 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,43,709కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 94,22,636 మంది కోలుకున్నారు. 3,39,820 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 15,55,60,655 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 9,93,665 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
మరోవైపు, తెలంగాణలో గత 24 గంటల్లో 491 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 596 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,78,599కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,69,828 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,499కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 7,272 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 5,169 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.