గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : మంగళవారం, 22 జనవరి 2019 (14:10 IST)

బెస్ట్ పార్లమెంటేరియన్‌గా సీఎం కేసీఆర్ కుమార్తె కె.కవిత

తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ తెరాస ఎంపీ కల్వకుంట్ల కవత ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికయ్యారు. ఆదర్శ్ కేటగిరీ విభాగంలో ఫేమ్ ఇండియా ఏషియా పోస్ట్ మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో ఆమె ఎంపికయ్యారు. ఈ అవార్డును ఈ నెల 31న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఎంపీ కవితకు ప్రదానం చేయనున్నారు. 
 
దేశంలోని లోక్‌సభ సభ్యుల్లో 25 మందిని ఈ అవార్డుకు ఎంపికచేయగా, ఇందులో తెలంగాణ నుంచి ఎంపీ కవిత ఉన్నారు. ప్రజాదరణ, కార్యశీలత, సామాజిక సేవాదృక్పథం, లోక్‌సభకు హాజరు, లోక్‌సభ నిర్వహణలో పాత్ర, నియమనిబంధనలు పాటించడం, ప్రశ్నలగడం తదితర అంశాల ఆధారంగా ఎంపీలను ఈ అవార్డుకు ఎంపికచేసినట్టు ఆ సంస్థ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
సర్వే నిర్వహించిన అత్యధిక విభాగాల్లో ఎంపీ కవితకు 90 శాతానికిపైగా పాయింట్లువచ్చాయి. కవిత తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, క్రియాశీలకంగా వ్యవహరించారని సర్వే రిపోర్టు పేర్కొన్నది. ముఖ్యంగా, రాజనీతి, ఉద్యమకారిణి, రణనీతి, సామాజిక సేవాదృక్పథం, ప్రజాదరణ, కార్యశీలత తదితర అంశాల్లో ఆమెకు మంచి గుర్తింపు ఉన్నదన్నదని తెలిపింది.
 
అలాగే, తెరమరుగవుతున్న తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించారన్నది. మహిళా, సామాజిక సమస్యలపై ఉద్యమాలు, సదస్సులు నిర్వహించారని చెప్పింది. 'ఫేమ్ ఇండియా ఏషియా పోస్ట్ మ్యాగజైన్' ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుకు ఎంపికచేసినందుకు ఎంపీ కవిత ఆ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు మరింత కష్టపడి పనిచేయడానికి స్ఫూర్తినిస్తుందని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.