గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: శనివారం, 17 నవంబరు 2018 (19:03 IST)

ఇన్సూరెన్స్ డబ్బు కోసం భార్యాభర్తల నాటకం... ఏజెంట్‌తో వివాహేతర సంబంధం...

హైదరాబాద్‌లోని రామాంతపూర్ శివారు ప్రాంతమది. రాజు, మణిలు ఇద్దరు భార్యాభర్తలు. వీరికి పిల్లలు లేరు. పెళ్ళయి నాలుగు సంవత్సరాలవతున్నా పిల్లలు కలుగలేదు. సెక్యూరిటీ గార్డుగా పనిచేసే రాజుకు జీతం అంతంతమాత్రం. దీంతో మణికి ఒక ఆలోచన వచ్చింది. చచ్చిపోయినట్లు నటిస్తే ఇన్సూరెన్స్ వస్తుందని భావించారు. రెండు రోజుల ముందు ఇంటి నుంచి వెళ్ళిన రాజు కనిపించకుండా పోయినట్లు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది మణి. వారం తరువాత ఆ ఏరియాలో మురికి కాలువలో ఒక శవం కనిపించింది. దీంతో మణికి సమాచారం ఇచ్చారు పోలీసులు. మణి అక్కడకు వచ్చి ఆ శవం తన భర్తదేనని చెప్పింది. 
 
దీంతో భర్త పేరుతో చేసిన ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి. డబ్బులు తీసుకుని తన స్వంత ఊరు కాకినాడకు వచ్చేసింది. అక్కడ రాజభోగాలు అనుభవిస్తోంది. భర్త రాజు కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళిపోయి అప్పుడప్పుడు భార్యకు ఫోన్ చేసేవాడు. అయితే రాజు వద్ద ఇన్సూరెన్స్ చేయించిన వ్యక్తి జాకీ స్వస్థలం కూడా కాకినాడే. ఒకరోజు సొంత ఊరిలో పని నిమిత్తం వచ్చిన జాకీ మణిని చూశాడు. ఆమెతో పరిచయం పెట్టుకున్నాడు. 
 
ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. బెంగుళూరు నుంచి ఫోన్లో మాట్లాడే రాజు ఉన్నట్లుండి ఒకరోజు ఇంటికి వచ్చాడు. జాకీ, మణిలు కలిసి ఉండటాన్ని చూసి ఓర్చుకోలేకపోయాడు. కోపాన్ని అణచుకుని భార్యకు ఫోన్ చేశాడు. ఇన్సూరెన్స్ విషయంలో జాకీ బాగా సహాయపడ్డాడని, అతను కాకినాడకు వస్తాడన్న విషయం తెలియదని, అయితే మీరు దగ్గర లేకపోవడంతో జాకీతో కలిశానని, క్షమించమని కోరింది మణి. 
 
రాజు ఒప్పుకోలేదు. జాకీని చంపేయాలన్నాడు. అతడిని నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకురమ్మన్నాడు. అయితే కొత్తగా నిర్మిస్తున్న భవనం దగ్గరకు జాకీని తీసుకొచ్చింది మణి. అక్కడే మాటు వేసి ఉన్న రాజు, జాకీని చంపేశాడు. హత్య గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ సిసి ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులో రాజు, మణిల వీడియోలు ఉన్నాయి. దీంతో వారిని విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.