రావణ కాష్టంలా తెలంగాణ.. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలి: వైఎస్ షర్మిల
కరోనాతో రాష్ట్రం రావణకాష్టంలా తయారైందని వైఎస్ షర్మిల చెప్పారు. ఇప్పటికైనా కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని తెలిపారు. కరోనా బారిన పడిన వారికి ఊరట కలిగించాలన్నారు. అందరికీ వ్యాక్సిన్ ఇచ్చి కాపాడాలని వైఎస్ షర్మిల తెలిపారు.
శనివారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ఇంకెప్పుడు కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తారని సీఎం కేసీఆర్‌ని ప్రశ్నించారు. ప్రతి 100 మందిలో 10 మందికి కరోనా వస్తోందన్నారు. ఆ 10 మందిలో 9 మంది పెద్దవాళ్లేనని చెప్పారు.
రాష్ట్రంలో కరోనా టెస్టులు లేవని,ఆసుపత్రులలో బెడ్స్ లేవని, పట్టించుకునే డాక్టర్స్ లేరని ధ్వజమెత్తారు.ఇక ఆసుపత్రులలో ఊపిరి నిలిపే ఆక్సిజన్ సిలిండర్లు లేవని ,బతికించే వ్యాక్సిన్ లేదని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేది లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతిరోజూ మూడు సార్లు రివ్యూ నిర్వహించి స్వయంగా పర్యవేక్షించాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రెమ్‌డెసివర్, వాక్సీన్, ఆక్సీజన్, ఆస్పత్రుల్లో బెడ్ల విషయంలో గానీ ఏ మాత్రం లోపం రానీయవద్దని సీఎస్‌కు సీఎం కేసీఆర్ సూచించారు.
అనుక్షణం కరోనా పర్యవేక్షణకు గానూ సీఎంవో నుంచి సీఎం కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డిని కేసీఆర్ నియమించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులందరూ జాగ్రత్తతో వ్యవహరించాలన్నారు. అధికారులంతా చక్కగా పనిచేసి అనతికాలంలోనే తెలంగాణను కరోనా మహమ్మారి నుంచి బయటపడేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.