తెలంగాణ ఎన్నికల బరిలో వైఎస్.షర్మల పార్టీ.. 119 స్థానాల్లో పోటీ
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ టీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. గురువారం రాష్ట్రంలోని 33 జిల్లాల పార్టీ నేతలతో ఈ రోజు షర్మిల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం 119 స్థానాల్లో వైకాపా పోటీ చేస్తుందని వెల్లడించారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లాలని భావించానని, ఇందుకోసం ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపి నాలుగు నెలల పాటు వేచి చూశామని చెప్పారు. తాను పాలేరుతో పాటు మరో స్థానంలో పోటీ చేస్తానని చెప్పారు.
తన తల్లి విజయమ్మ, భర్త అనిల్ కూడా పోటీ చేయాలనే డిమాండ్లు ఉన్నాయని, ఈ ఇద్దరిలో విజయమ్మే పోటీ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. బీఫామ్‌ల కోసం అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. తెలంగాణాలో మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తామని షర్మిల తెలిపారు.
హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే...
తెలంగాణ రాష్ట్రంలో నవంబరు 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా కార్లు, ద్విచక్రవాహనాల్లో భారీ మొత్తంలో నోట్ల కట్టలు వెలుగు చూస్తుండటంతో పోలీసులు సైతం విస్తుపోతున్నారు.
నిందితుల్లో అధికశాతం హవాలా మార్గంలో సొమ్ము తరలిస్తున్న ముఠాలే ఉంటున్నాయి. ఎన్నికల నియమావళి అమల్లోకి రావటంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. నగరవ్యాప్తంగా వాహనాలు సోదాలు చేస్తున్నారు. ఈ నెల 9 నుంచి బుధవారం ఉదయం వరకూ హవాలా మార్గంలో తరలిస్తున్న భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల వ్యవధిలో స్వాధీనం చేసుకున్న వాటి వివరాలిలా ఉన్నాయి.
అల్వాల్‌లో ఎస్‌వోటీ పోలీసులు జరిపిన తనిఖీల్లో ప్రముఖ వడ్డీ వ్యాపారిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి పట్టుబడటం కలకలం రేపింది. ఆయన నుంచి వారు రూ.24.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయాల్లో రాజకీయ నాయకులకు అప్పులు ఇవ్వడంలో పేరొందారు. ఈ క్రమంలో ఆయన నగదును తరలించబోతున్నట్లు సమాచారం అందడంతో మేడ్చల్ ఎస్‌వోటీ సీఐ శివకుమార్ బృందం నిఘా పెట్టింది. బుధవారం ఉదయం పట్టాభి నగదుతో ద్విచక్ర వాహనంలో వెళుతుండగా పట్టుకున్నారు.
కూకట్‌పల్లి పరిధిలో పోలీసులు జరిపిన తనిఖీల్లో రూ.2 కోట్ల విలువైన బంగారు నగలు, వజ్రాలు పట్టుబడ్డాయి. మరో ఘటనలో రూ.3.5 లక్షల నగదు లభించింది. బాలానగర్ ఎస్‌ఓటీ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కూకట్‌పల్లి ప్రధాన రహదారిపై తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్ మంగళ్‌ఘాట్‌కు చెందిన మార్కెటింగ్ వ్యాపారి గజానన్ అశోక్ బరిగె అలియాస్ రాహుల్(33)తో పాటు బాలుడు(17) అనుమానాస్పదంగా పట్టుబడ్డారు. వారిని తనిఖీ చేయగా 211 క్యారెట్ల వజ్రాలు, 2.311 కిలోల బంగారు నగలు లభించాయి. వాటి విలువ రూ.2 కోట్లకు పైగా ఉంటుంది. ఇదే విధంగా పలు ప్రాంతాల్లో నోట్ల కట్టలతోపాటు విలువైన ఆభరణాలు పట్టుబడుతున్నాయి.