ఖమ్మం వేదికగా రాజకీయ పార్టీ ప్రకటన : లక్ష మందితో బహిరంగ సభ
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్.షర్మిల కొత్త పార్టీ ప్రకటన తేదీ ఖరారైపోయింది. ఏప్రిల్ 9వ తేదీన ఆమె తన పార్టీ పేరును ప్రకటించనున్నారు. ఖమ్మం కేంద్రంగా లక్ష మందితో జరిగే భారీ బహిరంగ సభలో ఆమె తన పార్టీ పేరు, విధి విధానాలు వెల్లడించేందుకు నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే విషయంపై ఆమె ఆ జిల్లాకు చెందిన తన ఆత్మీయులు, నేతలతో చర్చలు జరిపారు.
తాను పెట్టబోయే పార్టీ పేరు కూడా 'వైఎస్సార్‌టీపీ' లేదా 'వైఎస్సార్ పీటీ' లేదా రాజన్నరాజ్యం అనే పేర్లను ఆమె పరిశీలించారు. అయితే, ఏప్రిల్ 9వ తేదీ నాటికి ఆమె తన పార్టీ పేరును ఖరారు చేసి, ఖమ్మంలో ప్రకటించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత మే 14 నుంచి లోటస్ పాండ్ వేదికగా పార్టీ కార్యకలాపాలు ప్రారంభించనున్నారు.
నిజానికి మొదట జులై 8న పార్టీని ప్రారంభిస్తారని అనుకున్నా... ప్రస్తుతం ఎండల కారణంగా తేదీల మార్పువిషయంలో షర్మిల అనుచరులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో చివరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తుండగా... అదే రోజు పార్టీ పేరును సైతం ఖమ్మం సభ వేదికగానే ప్రకటించేందుకు రంగంసిద్ధం చేసుకుంటున్నారు.
మే 14 రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తేదీని పార్టీ ఏర్పాటుకు వాడుకోవాలనుకున్నా.... ఎండల కారణంగా.... సభ పెట్టలేమని... ఆ రోజే పార్టీ వ్యవహారాలను లోటస్‌పాండ్ నుంచే ప్రారంభిస్తే బాగుంటుందన్న ఆలోచనలో షర్మిల ఉన్నారు.
మరోవైపు పలువురు బుల్లితెర ఆర్టిస్టులు సైతం షర్మిలను కలిశారు. మహిళలు అన్నిరంగాల్లో రానిస్తున్నారని... తెలంగాణ రాజకీయాల్లో షర్మిల తనదైన ముద్ర వేసుకుంటుందని వారు తెలిపారు. అయితే రాజకీయంగాకాకుండా తమకున్న పరిచయంతో మాత్రమే కలిశామని.. రాజకీయాలు మాత్రం ఆపాదించవద్దంటూ విజ్ఞప్తి చేశారు.