శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 11 ఏప్రియల్ 2020 (11:44 IST)

జూన్ వరకు థియేటర్లలో బొమ్మపడటం కష్టమేనట!!

ప్రపంచం కరోనా గుప్పెట్లో చిక్కుకుంది. ఈ వైరస్ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు అన్ని దేశాలు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. అలాగే, ప్రజలు గుంపులు, గుంపులుగా చేరకూడదని ఆదేశించింది. తప్పనిసరిగా సామాజికదూరం పాటించాలని కోరుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్ తర్వాత సినిమా థియేటర్లలో బొమ్మపడటం అనుమానాస్పదంగా మారింది. ఎందుకంటే.. కరోనా వైరస్ భయం ఇప్పట్లో పోయేలాలేదు. అలాంటపుడు థియేటర్లకు ప్రేక్షకుడు వచ్చేందుకు సాహసం చేయకపోవచ్చన్నది ఇండస్ట్రీ పెద్దల మాట. 
 
ముఖ్యంగా, లాక్‌డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీ బాగా దెబ్బతిన్నదని చెప్పొచ్చు. ఎక్కడి షూటింగ్‌లు అక్కడే ఆగిపోయాయి. థియేటర్లు మూతపడటంతో కొత్త సినిమాల విడుదల ఆగిపోయింది. ప్రస్తుత అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. కానీ, మ‌రో రెండు వారాల పాటు లాక్‌డౌన్ కొన‌సాగే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు. అంటే ఒక‌వేళ ఏప్రిల్ చివ‌రి వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగితే సినిమా థియేట‌ర్స్ ప‌రిస్థితేంటి? సినిమాల‌ను ఎప్పుడు? ఎలా విడుద‌ల చేసుకోవాలి? అంటూ నిర్మాత‌లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. 
 
సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు ఒకవేళ లాక్‌డౌన్‌ను ఏప్రిల్ త‌ర్వాత ఎత్తేసినా! ప్రేక్ష‌కుడు థియేట‌ర్‌కు రావాలంటే ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు. మాల్స్‌లో ఎక్కువ మంది గుంపులుగా చేరుతారు. అలా చేర‌డం మంచిది కాదు. కాబ‌ట్టి ప్ర‌భుత్వం థియేట‌ర్స్‌, మాల్స్‌ను వెంట‌నే ఓపెన్ చేయాల‌నుకోవ‌డం లేదని, జూన్ చివ‌రి వ‌ర‌కు థియేటర్స్‌, మాల్స్ మూత ప‌డే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి థియేట‌ర్స్, మాల్స్‌పై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోనున్నాయో వేచి చూడాలి.