శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 మార్చి 2017 (12:39 IST)

రజనీకాంత్‌కు కొత్త చిక్కు.. రోబో 2.0 కోసమే శ్రీలంకకు కబాలి పర్యటన?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కొత్త చిక్కొచ్చి పడింది. ఆర్కేనగర్ ఎన్నికల సందర్భంగా బీజేపీకే కాదు.. ఏ పార్టీకి సపోర్ట్ చేయనని క్లారిటీ ఇచ్చేసి.. రోబో సినిమా పనులు చూసుకుందాం.. అనుకున్న రజనీకాంత్‌కు శ్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కొత్త చిక్కొచ్చి పడింది. ఆర్కేనగర్ ఎన్నికల సందర్భంగా బీజేపీకే కాదు.. ఏ పార్టీకి సపోర్ట్ చేయనని క్లారిటీ ఇచ్చేసి.. రోబో సినిమా పనులు చూసుకుందాం.. అనుకున్న రజనీకాంత్‌కు శ్రీలంక టూర్ కష్టాలను తెచ్చిపెట్టింది. ఏప్రిల్ పదో తేదీన శ్రీలంకలోని జాఫ్నాలో రజనీకాంత్ పర్యటిస్తారని వార్తలు రావడంతో.. ఆయన పర్యటనపై విడుదలై చిరుతైగల్ కట్చి (వీసీకే)మండిపడింది. 
 
జాఫ్నాలో తమిళ నిర్వాసితుల కోసం నిర్మించిన ఇళ్ల తాళాలను లబ్ధిదారులకు రజనీ కాంత్ అందజేయనున్న తరుణంలో.. వీసీకేతో పాటు మరుమళర్చి ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎండీకే) గ్రూపులకు చెందిన తమిళ సంస్థలు మండిపడుతున్నాయి. సివిల్ వార్ కారణంగా శ్రీలంకలో నష్టపోయిన తమిళులు గురించి ఏమాత్రం పట్టించుకోని రజనీకాంత్.. ప్రస్తుతం వారికి ఇళ్లను పంచిపెట్టడం కోసం ఇప్పుడు వెళ్లడం ఏంటని తమిళ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. 
 
రోబో 2.0 కోసమే శ్రీలంకలో రజనీ పర్యటన?
శ్రీలంక టూరుకు రోబో 2.0 సినిమాకు లింకుండ బట్టే రజనీకాంత్ అక్కడికి వెళ్తున్నట్లు తమిళ సంస్థలు ఆరోపిస్తున్నాయి. తమిళ నిర్వాసితులకు ఇచ్చే ఇళ్లను లైకా గ్రూప్‌ చైర్మన్‌ సుభాష్ కరన్‌ అల్లిరాజా తల్లి పేరిట ఏర్పాటు చేసిన జ్ఞానం ఫౌండేషన్ నిర్మించింది. కానీ 2014లో లైకా గ్రూపు నిర్మించిన కత్తి చిత్రాన్ని శ్రీలంక తమిళ సంస్థలు నిషేధించాయి. తాజాగా లైకా నిర్మిస్తున్న రోబో 2.0లో రజనీ న‌టిస్తున్నారు. 
 
ఈ సినిమాను శ్రీలంకలో విడుదల చేయాలనే ఉద్దేశంతోనే రజనీకాంత్ చేతుల మీదుగా నిర్వాసిత తమిళులకు ఇంటి తాళాలను అందిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఇంకా మార్చిలో తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళ అధికారులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా 8 మంది భారత జాలర్లను అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ లంక పర్యటన కూడదని తమిళ సంస్థలు తెగేసి చెప్పేస్తున్నాయి.