శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 25 డిశెంబరు 2018 (10:15 IST)

2018 రౌండప్ : విని వినంగానే నచ్చేసావే అంటూ...

తెలుగు చిత్రపరిశ్రమలో 2018 సంవత్సరంలో వందలాది చిత్రాలు విడుదలయ్యాయి. కానీ, కొన్ని చిత్రాల్లోని కొన్ని పాటలు మాత్రమే ప్రేక్షకుల నోళ్ళలో ఇప్పటికీ నానుతున్నాయి. నిజానికి సినిమాకు పాటే ప్రాణం. కొందరు సంగీత ప్రియులు కేవలం పాటల కోసమే సినిమాకు వస్తుంటారు. అలా 2018 సంవత్సరంలో వచ్చిన చిత్రాల్లో ప్రేక్షకుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కొన్ని పాటలను పరిశీలిస్తే, 
 
'రంగస్థలం'లోని ఎంత సక్కగున్నవే...
చెర్రీ - సమంతలు నటించిన చిత్రం 'రంగస్థలం'. లెక్కల మాస్టార్ కె.సుకుమార్ దర్శకత్వం వహించిన చిత్రం. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్. కానీ, 'ఎంత సక్కగున్నవే' పాట హైలెట్. దేవీశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చగా, చంద్రబోస్ కలం నుంచి ఈ పాట జాలువారింది. ఓ పల్లెటూరి అమ్మాయి గురించి గొప్పగా వర్ణిస్తూ పల్లెటూరి కుర్రాడు పాడే ఈ పాట మళ్ళీ మళ్ళీ వినేలా చేసి సంగీతాభిమానుల మనసు దోచుకుంది.
 
"ఛలో" మూవీలోని చూసి చూడంగానే నచ్చేసావే...
ఈ యేడాది ఆరంభంలో వచ్చిన చిత్రం "ఛలో". ఈ మూవీలో నాగశౌర్య హీరోగా నటించాడు. ఇందులో 'చూసి చూడంగానే నచ్చేసావే' అంటూ సాగినపాట. ప్రతి ఒక్కరి నోట్లో నానుతూ మొబైల్ ఫోన్లలో రింగ్ టోన్ రూపంలో మోగుతూ హంగామా చేసింది. భాస్కర భట్ల రచించగా, సాగర్ మహత్ సంగీతం బాణీలు సమకూర్చారు. ఇప్పటివరకూ వినని ఓ కొత్త సౌండింగ్‌తో ఈ సాంగ్‌ని కంపోజ్ చేయడం జరిగింది. పైగా, వినగానే కనెక్ట్ అయ్యేలా ఉండే భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఓ అమ్మాయిని చూడగానే ఆ అందానికి మంత్ర ముగ్ధుడైన ఓ అబ్బాయి మనసులో మాటల్ని పాటగా మలిచిన విధానం అందరినీ కట్టిపడేసింది.
 
'గీతగోవిందం'.. ఇంకేం ఇంకేం కావాలె... 
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా నటించిన చిత్రం "గీతగోవిందం". ఇందులో పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చే సాంగ్ 'ఇంకేం.. ఇంకేం.. కావాలె' పాట. 2018లో మోస్ట్ పాపులర్ సాంగ్. గోపి సుందర్ సంగీతం సమకూర్చగా, అనంత్ శ్రీరాం కలం నుంచి జాలువారిన పాట. ఈ పాటకు గాయకుడు సిద్ శ్రీరామ్ తన గొంతుకతో ప్రాణం పోశాడు. 
 
'ఆర్ఎక్స్-100'లోని పిల్ల రా...
యువ హీరో కార్తికేయ నటించిన "ఆర్ఎక్స్ 100" మూవీలోని పాట 'పిల్ల రా'. ఈ పాటలో వచ్చే ముందు మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే థియేటర్స్ అంతా అరుపులతో దద్దరిల్లిన సాంగ్ ఇది. ట్యూన్‌కి పర్ఫెక్ట్ లిరిక్స్ అందించాడు గీత రచయిత. లిరిక్స్ యువతకు బాగా కనెక్ట్ అవ్వడం వల్లే ఈ సాంగ్ ఈ రేంజ్ హిట్ సాధించింది. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో భారీ రికార్డు వ్యూస్ సాధించి 2018లో పాపులర్ పాటగా నిలిచిపోయింది. 
 
'లవర్స్‌' మూవీలోని నాలో చిలిపి కల... 
2018లో మోస్ట్ పేవరేట్ పాటల లిస్టులో "లవర్స్" చిత్రంలోని 'నాలో చిలిపి కల' అనే పాట చేరింది. సంగీత ప్రియుల మనసును బాగా దోచుకున్న పాట. సాయి కార్తీక్ ఓ సన్నివేశం కోసం కంపోజ్ చేసిన చిన్న బిట్... ఆ తర్వాత ట్యూన్‌గా మారి చివరికి ఆల్బంలో సాంగ్‌గా చేరింది. ఈ సాంగ్‌లో వచ్చే వయోలిన్ వాయిద్యంతో పాటు శ్రీమణి అందించిన లిరిక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. 
 
'కృష్ణార్జున యుద్ధం'లోని దారి చూడు దుమ్మూ చూడు...
నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం "కృష్ణార్జునయుద్ధం". ఈ యేడాది వినిపించిన మంచిపాటల్లో ఇది ఒకటి. హిపాప్ తమిళ అందించిన సంగీతానికి చిత్తూరి యాసతో పెంచల్ దాస్ అదిరిపోయే లిరిక్స్ అందించాడు. పైగా ఈ పాటను తనేపాడి ఆ పాటకు మరింత అందం తీసుకొచ్చాడు. 
 
'భరత్ అనే నేను'.. వచ్చాడయ్యో సామి...
ప్రిన్స్ మహేష్ బాబు - కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రం టైటిల్ సాంగ్ ఓ కొత్త అనుభూతిని కలిగించింది. 'వచ్చాడయ్యో సామి' అంటూ సాగే ఈ పాట... ఈ యేడాది బెస్ట్ సాంగ్‌ల ఆల్బమ్‌లో చేరింది. 
 
'శ్రీనివాస కళ్యాణం'లోని కళ్యాణ వైభోగం...
నితిన్ - రాశిఖన్నా జంటగా నటించిన చిత్రం "శ్రీనివాస కళ్యాణం". దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలోని కళ్యాణ వైభోగం పాట ప్రత్యేక అనుభూతిని మిగిల్చింది. నిజానికి పెళ్లి పాటలకు సంబంధించి ఇప్పటికే చాలా పాటలొచ్చాయి, కానీ పెళ్లి గొప్పతనాన్ని చెప్తూ వచ్చిన పాటల్లో ఈ సాంగ్ ది బెస్ట్ సాంగ్‌గా నిలిచిందని చెప్పొచ్చు. మిక్కీ జే మేయర్ అందించిన ట్యూన్‌కి శ్రీమణి గొప్ప సాహిత్యం అందించగా, ఎస్పీ బాలు గానంతో మరింత వెన్నె తీసుకొచ్చారు.
 
'టాక్సీవాలా'లో మాటే వినదుగా...
విజయ్ దేవరకొండ నటించిన చిత్రం "టాక్సీవాలా". ఈ చిత్రంలోని మాటే వినదుగా అనే పాట ఓ రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాటకు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా కృష్ణకాంత్ లిరిక్స్ అందించాడు. యూత్‌కి బాగా కనెక్ట్ అయిన ఈ సాంగ్ ఈ ఇయర్ సూపర్ హిట్ పాటల్లో నిలిచింది.
 
అలాగే, 'హలో గురు ప్రేమకోసమే' చిత్రంలో స్వరపరిచిన పెద్ద పెద్ద కళ్ళతోటి పాట కూడా ఈ యేడాది అందరినీ ఆకట్టుకుంది. 'హ్యాపీ వెడ్డింగ్' సినిమాలోని 'కాదని నువ్వంటున్నది' అనే పాట హిట్ జాబితాలో చేరింది. చివరగా ఈ యేడాది ఆఖరులో వచ్చిన చిత్రం "పడి పడి లేచె మనసు" చిత్రం. ఇందులో శర్వానంద్ సాయి పల్లవి జంటగా నటించారు. ఈ చిత్రంలోని పాటలన్నీ బాగున్నాయి. కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీత బాణీలను సమకూర్చారు. ఇలా అనేక పాటలు సంగీత ప్రియుల మనస్సులో చెరగని ముద్రవేసుకున్నాయి.