శనివారం, 9 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 24 డిశెంబరు 2018 (19:48 IST)

2018 మూవీ రౌండప్ : కెరటంలా దూసుకొచ్చిన దర్శకులు

ప్రతి యేడాదిలాగే ఈ యేడాది కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త దర్శకులు పరిచయమయ్యారు. వీరంతా కెరటంలా దూసుకొచ్చి, ప్రేక్షకులను మంత్రమగ్ధులను చేశారు. తాము దర్శకత్వం వహించిన తొలి చిత్రంతోనే తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలా 2018లో తొలి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుల వివరాలను పరిశీలిస్తే... 
 
అజయ్ భూపతి...
'ఆర్ఎక్స్100' మూవీతో వెండితెరకు పరిచయమైన దర్శకుడు అజయ్ భూపతి. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఈయన తీసిన తొలి చిత్రం యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. పైగా, ఈ చిత్రం నిర్మాతకు కనకవర్షం కురిపించింది. ఫలితంగా తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ నిరూపించుకున్నాడు. ఈ సినిమాతో కార్తికేయ - పాయల్ రాజ్‌పుత్‌లను సిల్వర్ స్క్రీన్‌కి పరిచయం చేసిన అజయ్ ఈ ఇద్దరి నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ రాబట్టి... ఆడియన్స్‌కి ఓ డిఫరెంట్ లవ్ ఎంటర్టైనర్ మూవీని అందించాడు.
 
వెంకీ కుడుముల...
సెన్సేషనల్ డైరెక్టర్ తేజ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి వెంకీ కుడుముల.. 'ఛలో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈయన తన తొలి చిత్రంలోనే ప్రేక్షకులను ఎంటర్‍టైన్ చేయగలిగాడు. పైగా, 2018లో బెస్ట్ కామెడీ చిత్రంగా 'ఛలో' చోటుదక్కించుకుంది. తను అనుకున్న కథను ఎక్కడా తడబడకుండా తెరకెక్కించి తన తొలి చిత్రంలోనే శభాష్ అనిపించుకున్నాడు. అంతేనా, వరుస పరాజయాలబాటలో పయనిస్తున్న హీరో నాగశౌర్యను హిట్ బాటలోకి తీసుకెళ్లిన దర్శకుడు.
 
వెంకీ అట్లూరి...
వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్ పడిన చిత్రం 'తొలిప్రేమ'. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా, ప్రేక్షకులను థియేటర్లకు మళ్లీమళ్లీ రప్పించిన డెబ్యూ డైరెక్టర్ ఈయన. ఫస్ట్‌లుక్ నుంచి చిత్రం విడుదల వరకు ప్రేక్షకులపై పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గిపోకుండా నిర్మించాడు. యాక్టర్ నుంచి డైరెక్టర్‌గా మారిన వెంకీ అట్లూరి... తన తొలి చిత్రంతోనే ప్రేమ చిత్రాల ప్రయోగకర్త అనే ముద్రవేసుకున్నాడు.
 
ప్రశాంత వర్మ... 
నాని నిర్మాతగా తీసిన సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ "అ!". ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత వర్మ ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చేశాడు. ముఖ్యంగా, తన విజన్, టేకింగ్‌తో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. విభిన్న కథలతో చిత్రాలు తీసే దర్శకుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
 
వక్కంతం వంశీ.. 
అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' అనే చిత్రంతో టాలీవుడ్ దర్శకుడుగా అవతారమెత్తిన వక్కంతం వంశీ. ఈయన రైటర్ నుంచి డైరెక్టర్‌గా మారాడు. ఫలితంగా ఎప్పటినుంచో తాను కంటున్న కలను సాకారం చేసుకున్నాడు.
 
వెంకటేష్ మహా... 
'కేరాఫ్ కంచరపాలెం' చిత్రంతో దర్శకుల జాబితాలో చేరిన దర్శకుడు వెంకటేష్ మహా. తన డెబ్యూ మూవీతో ఓ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. రిలీజ్‌కి ముందే ప్రిమియర్ షోల ద్వారా టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న వెంకటేష్ స్టార్ డైరెక్టర్స్‌ని సైతం మెస్మరైజ్ చేశాడు. తన దర్శకత్వ ప్రతిభతో రాజమౌళి… సుకుమార్.. క్రిష్.. వంటి అగ్ర దర్శకులతో శెభాష్ అనిపించుకున్నాడు.
 
వేణు ఉడుగుల ..
'నీది నాది ఒకే కథ' అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైన దర్శకుడు వేణు ఉడుగుల. కొందరు కుర్రాళ్ళ జీవితాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు. తాను చెప్పదలచుకున్న కథను సూటిగా చెప్పి ఇతర దర్శకులు ప్రశంసలు అందుకున్నాడు.
 
శశి కిరణ్...
అపుడెపుడో సూపర్ స్టార్ కృష్ణ చేసిన జైమ్స్ బాండ్ చిత్రాలను మళ్లీ ఈతరం వారికి పరిచయం చేసిన దర్శకుడు శశి కిరణ్. తన డెబ్యూ మూవీతోనే స్టార్ హీరోలను సైతం తనవైపునకు తిప్పుకున్నాడు. 'గూఢచారి' చిత్ర కథను నడిపిన తీరు అత్యద్భుతం. నిజానికి ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది.
 
రాహుల్ రవీంద్రన్... 
'చిలసౌ' చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు రాహుల్ రవీంద్రన్య. డైరెక్టర్‌గా మారుదామని వచ్చి యాక్టర్ అయ్యాడు. కానీ, తన టాలెంట్‌తో 'చిలసౌ' చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇందులో సుశాంత్‌ను ఓ క్లాస్ హీరోగా చూపించి రొమాంటిక్ లవ్ స్టోరీ పేరుతో వినోదం పంచాడు.
 
అలాగే, 'నన్ను దోచుకుందువటే' చిత్రానికి దర్శకత్వం వహించిన ఆర్.ఎస్.నాయుడు, 'యూటర్న్' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన పవన్ కుమార్, 'సుబ్రహ్మణ్యపురం' చిత్రం ద్వారా వెండితెరకు దర్శకుడుగా పరిచయమైన సంతోష్ జాగర్లమూడి తన డైరెక్షన్స్‌ స్కిల్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో వచ్చే కొన్ని కీలకమైన సన్నివేశాలను అనుభవం ఉన్న దర్శకుడులా డీల్ చేసిన సంతోష్ దర్శకుడిగా మంచి మార్కులే అందుకున్నాడు.