ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2024 (09:32 IST)

తొలి తెలుగు చైల్డ్ కామెడీ ఆర్టిస్ట్ గరిమెల్ల విశ్వేశ్వర రావు గుండెపోటుతో మృతి!!

vishweshwara rao
ప్రముఖ హాస్య నటుడు గరిమెల్ల విశ్వేశ్వర రావు (64) కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతూ వచ్చిన ఆయనకు సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్టు ఆయన పెద్ద కుమార్తె భార్గవి వెల్లడించారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం ముగిశాయి. ఆయనకు భార్య వరలక్ష్మి, కుమార్తెలు భార్గవి, పూజలు ఉన్నారు. తమిళం, తెలుగు భాషల్లో దాదాపు 350కు పైగా నటించిన ఆయన స్వస్థలం కాకినాడ. 1967లో చెన్నైకు వచ్చిన ఆయన బాల నటుడుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. మాస్టర్ రాము, బేబి రాణి, మాస్టర్ ప్రభాకర్ వంటి బాల నటులు రాణిస్తున్న సమయంలో ఆయన బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి తన ప్రతిభను నిరూపించుకున్నారు. 
 
ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏన్నార్, కాంతారావు, హరనాథ్, జగ్గయ్య వంటివారు పాత్రలు వేస్తుంటే రేలంగి, పద్మనాభం, చలం. రాజబాబు హాస్య పాత్రలు పోషించేవారు. ఈ హస్యనటుల చిన్నపాటి వేషాలు విశ్వేశ్వర రావు వేసేవారు. బాల తారలతో తీసిన బాలభారతంలో ఆయన కీలక పాత్రను పోషించారు. తెలుగు చిత్రాల వరకు తొలి కామెడి కిడ్ అయనే కావడం గమనార్హం. చిన్నప్పుడు హాస్య నటుడుగా ఎంతో పేరు తెచ్చుకున్నప్పటికీ పెరిగి పెద్దయ్యాక నటుడుగా ఆయన ఆ స్థాయిలో రాణించలేకపోయారు. సినిమాల్లోనే కాకుండా, టీవీ సీరియల్స్‌లో కూడా ఆయన రాణించారు. అవకాశాలు తగ్గిన సమయంలో సొంతంగా విస్సు టాకీస్ పేరుతో ఓ యూట్యూబ్ చాలెన్ ప్రారంభించి తన స్వీయ అనుభవాలతో పాటు అనేక మంది సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలను ఆయన తెలియజేసేవారు.