శుక్రవారం, 11 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (08:37 IST)

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

manoj kumar
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మనోజ్ కుమార్ (87) శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన ముంబైలోని కోకిలా బెన్ ధీరుభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 
 
1937లో జన్మించిన మనోజ్ కుమార్... అసలు పేరు హరికృష్ణ గోస్వామి. 1957లో 'ఫ్యాషన్' అనే చిత్రంతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. 'కాంచ్ కీ గుడియా' అనే సినిమా నటించి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత దర్శకుడుగా, రచయితగా, నటుడుగా ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. ఎక్కువగా దేశభక్తి చిత్రాలను తెరకెక్కించడంలో ఆయనకు పెట్టింది పేరు. దీంతో ఆయన పేరు కూడా మనోజ్ కుమార్ నుంచి భరత్ కుమార్‌గా మారిపోయింది. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన చిత్రపరిశ్రమకు సేవలు అందించారు. బాలీవుడ్‌లోని అగ్రహీరోలందరితో ఆయన కలిసి పనిచేశారు. 
 
ఆయన తెరకెక్కించిన అనేక చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్ మూవీలుగా నిలిచాయి. అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కించిన 'రోటీ కపడా ఔర్ మకాన్' చిత్రం 1974లోనే అతిపెద్ద విజయం సాధించిన మూవీ చరిత్రపుటల్లో నిలిచిపోయింది. మనోజ్ కుమార్ తన కెరీర్‌లో ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం గత 1982లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది.