1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 ఏప్రియల్ 2020 (12:45 IST)

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇకలేరు, అమితాబ్ సంతాపం

ఇర్ఫాన్ ఇకలేరు
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇకలేరు. కేన్సర్ వ్యాధిని జయించినప్పటికీ.. పెద్ద పేగు వ్యాధి నుంచి మాత్రం ఆయన కోలుకోలేక పోయారు. ఫలితంగా ముంబైలోని ఓ కార్పొరేట్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆయనకు వయసు 54 యేళ్లు. ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. 
 
గత కొన్నేళ్లుగా ఆయన కేన్సర్‌ వ్యాధితో పోరాటం చేశారు. కొన్ని నెలల క్రితం కోలుకున్నాడు. మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయన పెద్ద పేగు వ్యాధి కూడా సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఈ వ్యాధికి అక్కడ చికిత్స పొందుతూ వచ్చారు. కానీ, ఆయన పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు.
 
కాగా, నాలుగు రోజుల క్రితమే ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీద బేగం (95) మృతి చెందిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆమె అంత్యక్రియలు జరగగా ఇర్ఫాన్ ఖాన్ వెళ్లలేకపోయారు. లాక్‌డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే తల్లి అంత్యక్రియలను చూశారు. ఈ ఘటన ఆయనను మరింత బాధ పెట్టేలా చేసింది. తల్లి మరణంతో ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లారని ఆయన మిత్రులు మీడియాకు తెలిపారు.
 
ఇర్ఫాన్ ఖాన్‌ మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇర్ఫాన్‌ ఖాన్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు, హీరోలు, హీరోయిన్లు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఓ గొప్ప నటుడిని కోల్పోయామంటూ పలువురు నటులు ట్వీట్లు చేశారు. ఇర్ఫాన్ ఖాన్‌ మృతి గురించి తెలుసుకున్నానని, ఇది చాలా విచారకర వార్త అని బాలీవుడ్ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ సంతాపం వ్యక్తంచేశారు.