1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 13 జూన్ 2024 (20:27 IST)

కోలీవుడ్‌లో విషాదం : 'మహారాజ' నటుడు ప్రదీప్ కన్నుమూత

pradeep
తమిళ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటంచిన 'మహారాజ' చిత్రంలో నటించిన నటుడు ప్రదీప్ కె. విజయన్ అనుమానాస్పదంగా మృతి చెందారు. చెన్నై పాలవాక్కంలోని ఆయన స్వగృహంలోనే ఆయన విగతజీవిగా కనిపించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు... ప్రదీప్ రెండు రోజుల క్రితమే అతడు చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. 
 
అవివాహితుడైన ప్రదీప్... చెన్నైలోని పాలవాక్కమ్‌లో గల ఓ ఫ్లాట్‌లో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. గత రెండు రోజులుగా స్నేహితులు అతడికి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన ఓ మిత్రుడు బుధవారం నటుడి ఇంటికివెళ్లి చూడగా లోపలినుంచి తాళం వేసి కన్పించింది. ఎన్నిసార్లు కొట్టినా తలుపు తీయకపోవడంతో అతడు పోలీసులకు సమాచారమిచ్చాడు.
 
పోలీసులు అక్కడికి చేరుకుని తలుపు బద్దలుకొట్టి ఇంట్లోకి వెళ్లగా బాత్రూమ్‌లో ప్రదీప్‌ విగతజీవిగా కన్పించాడు. తలకు బలమైన గాయం తగలడం లేదా గుండెపోటుకు గురై అతడు మృతిచెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం నటుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజుల క్రితం ప్రదీప్‌ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డాడని అతడి స్నేహితుడు పోలీసులకు చెప్పారు. నటుడి మృతిపై సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.