శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 జనవరి 2020 (10:58 IST)

నటి అమలా పాల్ తండ్రి హఠాన్మరణం... దుఃఖసాగరంలో హీరోయిన్ ఫ్యామిలీ

సినీ నటి అమలాపాల్ ఇంట విషాదం సంభవించింది. ఆమె తండ్రి వర్గిస్ పాల్ బుధవారం హఠాన్మరణం చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన.. ఉన్నట్టుండి చనిపోయారు. తండ్రి మృతివార్త తెలియగానే అమలా పాల్ బోరున విలపించింది. ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న ఆమె హుటాహుటిన చెన్నై నుంచి కేరళ బయల్దేరింది. ఆమె ఇంటికి చేరుకున్న తర్వాత వర్గీస్ పాల్ అంత్యక్రియలను పూర్తి చేయనున్నారు. 
 
కాగా, తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అమలా పాల్ అక్కినేని నాగచైతన్య నటించిన బెజవాడ చిత్రం ద్వారా అడుగుపెట్టింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన నాయక్ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అల్లు అర్జున్‌తో కలసి చేసిన 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ఆమెకు స్టార్ డమ్‌ను తీసుకొచ్చింది. 
 
ఒక్క తెలుగులోనే కాకుండా, మాతృభాష మలయాళం, తమిళంలలో కూడా ఆమె బిజీగా ఉంది. కెరీర్ టాప్ లెవెల్‌లో కొనసాగుతున్న సమయంలో తమిళ దర్శకుడు విజయ్‌ను ఆమె ప్రేమించి, పెళ్లాడింది. అయితే, ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు ఆశించిన స్థాయిలో సినిమా అవకాశాలు రాలేదు. ఇప్పుడిప్పుడే ఆమె వరుసగా సినిమాలు చేస్తూ జోష్ పెంచింది. ఇలాంటి సమయంలో తండ్రిని కోల్పోవడం బాధాకరమని చెప్పొచ్చు.