సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 జూన్ 2021 (14:57 IST)

టీచర్‌గా హీరోయిన్ అనుపమ : టీచర్ అర్హత పరీక్షల్లో పాస్

టాలీవుడ్ హీరోయిన్, మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఉపాధ్యాయ అర్హత ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైంది. అదీ కూడా బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రవేశపరీశక్షలో... ఇది నిజంగా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. 
 
బీహార్ అధికారులు తమ విధులను ఎంత నిబద్ధతతో నిర్వహిస్తున్నారో ఈ సంఘటన చెపుతుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష (నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్) రాసినందుకు అభ్యర్థికి ఇచ్చే మార్కుల జాబితాలో అభ్యర్థి ఫోటోకు బదులుగా హీరోయిన్ ఫోటోను ముద్రించారు. కేరళ రాష్ట్రానికి చెందిన హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ఫోటో ఉండటం చూసిన సదరు అభ్యర్థి కాస్త ఖంగుతిన్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్‌కు చెందిన రిషికేశ్ అనే యువకుడు ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (SET) రాశాడు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో అతడికి మంచి మార్కులే వచ్చాయి. కాని మార్క్ షీట్‌లో మాత్రం అత‌ని ఫొటోకి బ‌దులు వేరే వారి ఫొటో ప్ర‌త్య‌క్షం అయింది. 
 
ఆ ఫొటో మ‌రెవ‌రిదో కాదు మ‌ల‌యాళ న‌టి అనుప‌మ‌ పరమేశ్వరన్‌ది. ఈ విష‌యాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ప‌ట్టించుకోలేద‌ట‌. అయితే ఈ మార్కుల జాబితా ఫోటో వైర‌ల్ కావ‌డంతో బీహార్ విద్యాశాఖ తీరుపై విమర్శలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో అధికారులు స్పందించారు. ఈ తప్పిదంపై దర్యాప్తునకు ఆదేశించామని బీహార్ విద్యాశాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు. 
 
కాగా, గతంలో కూడా బీహార్ ప్రభుత్వ అధికారులు ఇలాంటి తప్పులే చేశారు. ఓ విద్యార్థి దరఖాస్తు ఫారంలో.. తండ్రి పేరు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మిగా పడింది. తల్లి పేరు సన్నీ లియోన్‌గా పేర్కొన్నారు. ఇక అడ్రెస్‌ను ముంబై రెడ్ ఏరియాగా ముద్రించారు. అంతకుముందు జూనియర్ ఇంజనీర్ పరీక్షల్లో సన్నీ లియోన్‌ను టాపర్‌గా ప్రకటించారు. ఇపుడు అనుపమా పరమేశ్వరన్ ఫోటను ముద్రించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు.