"అల వైకుంఠపురములో" మేకింగ్ వీడియో... నిర్మాతను నేనేనంటున్న బుడతడు!!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందించిన చిత్రం అల వైకుంఠపురములో. ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. పూజా హెగ్డే హీరోయిన్ కాగా, సీనియర్ టబు కీలక పాత్రలో నటించింది. వీరితోపాటు.. మలయాళ నటుడు జయరాం , మురళీశర్మ, తమిళ నటుడు సముద్రఖని కూడా నటించారు.
ఈ చిత్రం విడుదలకు మరికొన్ని గంటలే ఉన్న తరుణంలో చిత్ర యూనిట్ ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో హీరో అల్లు అర్జున్ తన భార్యాపిల్లలతో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా, బన్నీ కుమారుడు అల్లు అయాన్ మేకింగ్ వీడియోలో అల్లు అయాన్, కెమెరా నుండి చూస్తూ ఈ సినిమాకు నేనే నిర్మాతను అని చెప్పి నిర్మాతలకు షాకివ్వడం కొసమెరుపు.
కాగా, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణలు సంయుక్తంగా గీతాఆర్ట్స్-2, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. అల వైకుంఠపురములో చిత్రానికి అద్భుతమైన సంగీత బాణీలను ఎస్. థమన్ సమకూర్చగా, ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసిన గంట వ్యవధిలోనే లక్షన్నర మంది నెటిజన్లు వీక్షించారు.