తన సిబ్బందికి ఉచితంగా కరోనా టీకాలు వేయించిన బన్నీ
టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ ఓ సాధారణ పౌరుడులాగానే ఉంటారు. బడా నిర్మాత అల్లు అర్జున్ కుమారుడన్న భావన ఆయనలో ఇసుమంత కూడా కనిపించదు. అలాగే, తన చుట్టూ పనిచేసేవారి బాగోగులను తన కుటుంబ సభ్యుల్లాగానే చూసుకుంటారు. ఇందుకు నిదర్శనమే... తాజాగా, ఆయన తన సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ఇప్పించారు.
తన టీమ్‌లోని 45 ఏళ్లకు పైబడిన వారికి, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ డోసులు వేయించారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అల్లు అర్జున్ స్వయంగా సమకూర్చి, పర్యవేక్షించారు.
టాలీవుడ్ అగ్రహీరోల్లో సొంతంగా ఓ టీమ్‌ను కలిగివున్న వారిలో అల్లు అర్జున్ ఒకడు. వారి బాగోగుల పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తుంటారు. తన టీమ్‌లోని అనేకమందికి పుట్టినరోజు వేడుకలను బన్నీ స్వయంగా నిర్వహిస్తుండడం తెలిసిందే.
మెగా ఫ్యామిలీకి చెందిన హీరోల్లో తొలుత చిరంజీవి కరోనా వైరస్ బారినపడగా, ఆ తర్వాత నాగబాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, రామ్ చరణ్ ఇలా వరుసగా ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు.