బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 మే 2021 (15:42 IST)

కరోనాపై పోరాటం : స్టాండ్ టుగెదర్ అంటున్న ఆర్ఆర్ఆర్ టీమ్

దేశాన్ని కరోనా వైరస్ చుట్టుముట్టేసింది. ఈ వైరస్ దెబ్బకు ప్రజలు వణిపోతున్నారు. అనేక మంది బతుకులు రోడ్డుపడున్నాయి. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలించడం లేదుకదా, కరోనా సంక్షోభం నానాటికీ తీవ్రం అవుతోంది.
 
ఈ నేపథ్యంలో "ఆర్ఆర్ఆర్" చిత్రబృందం ప్రజల్లో విస్తృతస్థాయిలో అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రచారానికి తెరదీసింది. చిత్ర దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, కీలకపాత్రధారి అజయ్ దేవగణ్, కథానాయిక అలియా భట్ ఓ వీడియోలో తమ సందేశాన్ని అందించారు. అయితే, వారందరూ ఒక్కొక్కరు ఒక్కో భాషను ఎంచుకుని తమ సందేశాన్ని అందించడం విశేషం.
 
రాజమౌళి మలయాళంలో, ఎన్టీఆర్ కన్నడ భాషలో, రామ్ చరణ్ తమిళంలో, అజయ్ దేవగణ్ హిందీలో మాట్లాడారు. కథానాయిక అలియా భట్ తెలుగులో మాట్లాడారు. 
 
ఖచ్చితంగా మాస్కు ధరించాలని, శానిటైజర్‌తో తరచుగా చేతులను శుభ్రం చేసుకుంటుండాలని, భౌతికదూరం తప్పనిసరి అని ఆర్ఆర్ఆర్ యూనిట్ సభ్యులు పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను టీకా వేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.
 
కరోనాను ఓడించాలంటే 'స్టాండ్ టుగెదర్' పేరుతో ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ఈ వీడియోను పంచుకుంది. భిన్న భాషల్లో మాట్లాడడం వల్ల తమ సందేశం అనేక రాష్ట్రాల ప్రజలకు చేరుతుందని ఆర్ఆర్ఆర్ యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.