సినిమా అంటే రంగుల ప్రపంచం కాదు.. మాయా ప్రపంచం.. మోసం చేశారు.. భూమిక
సినీ నటి భూమిక ఎన్నో సంవత్సరాలుగా తన మనసులోని దాచుకున్న ఓ బాధను వెళ్లగక్కారు. చిత్రపరిశ్రమ అంటే రంగుల ప్రపంచం కాదని, మాయా ప్రపంచమని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా, తనను కొందరు మోసం చేశారని ఆమె ఆరోపించారు. లేకుంటే తన పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు.
ఈమె హిందీలో నటించిన తొలి చిత్రం "తేరే నామ్". మంచి విజయం సాధించింది. దీంతో భూమికకు వరుస అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. 'తేరే నామ్' చిత్రం తర్వాత భారీ ఆఫర్ ఒకటి వచ్చింది. అయితే నిర్మాతలు మారిపోవడంతో హీరోతో పాటు తనను కూడా ఆ సినిమా నుంచి తొలగించారని చెప్పారు. ఆ సినిమా టైటిల్‌ను కూడా మార్చేశారని చెప్పారు. ఆ సినిమాలో తాను నటించివుంటే ఇపుడు తన పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు.
ఆ సినిమా గురించి తాను ఏదోదో ఊహించుకున్నానని, మరో సినిమాకు కూడా సైన్ చేయకుండా యేడాది వేచి చూశానని చెప్పింది. అంతేకాకుండా, "జబ్ వీ మెట్" సినిమాకు కూడా తొలుత తానే సంతకం చేశానని చెప్పారు. తనకు జోడీగా బాబీ డియోల్‌ను తీసుకున్నారని, ఆ తర్వాత ఆయన్ను తప్పించి, షాహిద్ కపూర్‌ను తీసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత తనను కూడా తీసేశారని వివరించారు. చివరకు ఆ చిత్రంలో షాహిద్ కపూర్, కరీనా కపూర్ నటించారని భూమిక తాజాగా తన మనసులో దాచుకున్న మాటను బహిర్గతం చేశారు.