గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 26 జులై 2017 (02:48 IST)

బిగ్ బాస్ ఇంట్లో ఊపిరాడని ఫీలింగ్.. పారిపోవాలని చూస్తున్న హోస్ట్‌లు

ఒక మనిషిని లేదా కొంతమంది మనుషులను బయటకు పోలేని ఇంట్లో బంధించి టీవీలూ, సినిమాలూ, ఫోన్‌లు కూడా లేకుండా దిగ్బంధించి మాట్లాడుకోండి అని వదిలేస్తే వాళ్ల బతుకు ఏమవుతుందంటే బిగ్ బాస్ అవుతుంది. ఇన్నాళ్లూ హాయిగా ఇంట్లో బయటా ఇష్టమొచ్చినట్లుగా తిరుగుతూ స్వేచ్ఛగా

ఒక మనిషిని లేదా కొంతమంది మనుషులను బయటకు పోలేని ఇంట్లో బంధించి టీవీలూ, సినిమాలూ, ఫోన్‌లు కూడా లేకుండా దిగ్బంధించి మాట్లాడుకోండి అని వదిలేస్తే వాళ్ల బతుకు ఏమవుతుందంటే బిగ్ బాస్ అవుతుంది. ఇన్నాళ్లూ హాయిగా ఇంట్లో బయటా ఇష్టమొచ్చినట్లుగా తిరుగుతూ స్వేచ్ఛగా వ్యవహరించిన వారు బిగ్ బాస్ హౌస్‌లో మూసిన తలుపుల మధ్య నోరు మాత్రమే ఉపయోగిస్తూ బతకటం ఎంత కష్టమో వారంరోజుల్లోపే అందరికీ అర్థమవుతోంది. ఒకరకంగా ఇది మనుషుల మానసిక స్థయిర్యం ఎంత బలంగా ఉందో, బలహీనంగా  ఉంటోందో తెలిపే లిట్మస్ టెస్టుగా కూడా బిగ్ బాస్ ఉపయోగపడుతోంది. ఈ పరీక్షలో ప్రస్తుతం బిగ్ బాస్ షోలో పాల్గొంటున్న వారిలో అందరికంటే మానసిక బలహీనులు ఎవరో తెలుసా. ఒక ఆడ, ఒక మగ. వారెవరో చూద్దాం.
 
ఇంతకూ బిగ్ బాస్ అంటే ఏమిటి? ప్రతి మూలా కెమెరాలు ఉన్న ఇంట్లో 14 మందిని ‘బంధించి’ వారికి బయటి వాతావరణం చూపకుండా, టైమ్‌ చెప్పకుండా, పేపర్‌ ఇవ్వకుండా, టీవీ ఫోన్‌ లేకుండా కేవలం నాలుగు గోడల మధ్య ఉంచి వారి మధ్య భావోద్వేగాలను కాప్చర్‌ చేయడం ఈ షో ఉద్దేశం. టీవీ నటుడు సమీర్, ఐటమ్‌ గర్ల్‌ ముమైత్‌ ఖాన్, కమెడియన్‌ ధన్‌రాజ్‌ తదితరులు పాల్గొంటున్న ఈ షోలో సభ్యులను ‘క్లాస్ట్రోఫోబియా’ బాధిస్తున్నదని తెలియవస్తోంది. కిటికీలు లేని గదుల్లో, లిఫ్ట్‌లలో, జన సమూహాల్లో ఊపిరాడని భావనను ‘క్లాస్ట్రోఫోబియా’ అంటారు. 
 
ప్రస్తుతం నటుడు సంపూర్ణేశ్‌ బాబు బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఈ భావనతో బాధపడుతున్నాడు. ‘నాది పల్లెటూరి నేపథ్యం. ఇక్కడ నన్ను బంధించేసినట్టుగా ఉంది. నన్ను పంపించేయండి’ అని అతడు బిగ్‌బాస్‌ షోలో ప్రాధేయపడుతున్నాడు. హౌస్‌లో ఉన్న ఇతర హౌస్‌ మేట్స్‌ కూడా సంపూర్ణేశ్‌ బాబు ఆరోగ్య స్థితిని గమనించి అతడిని షో నుంచి ఎలిమినేట్‌ చేయడానికి అందరూ అతడి పేరును ఈ వారం నామినేట్‌ చేశారు. 
 
ఇక ఇదే షోలో పాల్గొంటున్న గాయని మధు ప్రియ కూడా మానసిక ఉద్వేగాలతో తీవ్రంగా సతమతమవుతూ ఉన్నది. ఈ షోలో ఇమడలేక పదే పదే విలపిస్తూ ఇల్లు గుర్తుకు వస్తున్నది అంటూ ఆమె కలత పడుతున్నది. ఆమెను కూడా షో నుంచి బయటకు పంపించడానికి ఇతర హౌస్‌మేట్స్‌ అందరూ ఆమె పేరును నామినేట్‌ చేశారు. అంతా సరిగ్గా జరిగితే ఈ వారాంతంలో బిగ్‌బాస్‌ నుంచి సంపూర్ణేశ్‌ బాబు కాని, మధు ప్రియను కాని బయటకు వచ్చే అవకాశం ఉంది.
 
అంతా బాగున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. కాని కొత్త మనుషులతో కొత్త వాతావరణంలో ఉన్నప్పుడు మన అసలు సంగతి బయటపడుతుంది. బిగ్‌బాస్‌లో ఉండి ప్రతి చిన్న విషయానికి ఏడుపు లంకించుకుంటున్న హౌస్‌మేట్‌లలో ముమైత్‌ఖాన్‌ ఉంది. ఆమె బిగ్‌బాస్‌లో తన హాస్టల్‌ వాతావరణం గుర్తుకు వస్తున్నదని ఇమడలేకపోతున్నానని వాపోతూ ఉంది. మరొక వైపు గాయని కల్పన కూడా తీవ్రమైన ఉద్వేగాలతో కన్నీరు కార్చడం కనిపిస్తూ ఉంది. టీవీ నటి హరితేజ కూడా నాలుగైదు సందర్భాలలో కన్నీరు కార్చింది. 
 
ఇదంతా చూసి ఈ షోను హోస్ట్‌ చేస్తున్న ఎన్టీఆర్‌ ‘మన కన్నీళ్లు చాలా విలువైనవి. చిల్లర కారణాలకి వాటిని వృథా చేయవద్దు’ అని హౌస్‌మేట్స్‌కు హితవు చెప్పాల్సి వచ్చింది. బిగ్‌బాస్‌ షోలో మానసిక బలంతో వ్యవహరిస్తున్న వారు ధన్‌రాజ్, ఆదర్శ్, శివబాలాజీ, సమీర్, ప్రిన్స్, ఫిల్మ్‌ క్రిటిక్‌ కత్తి మహేశ్‌ ఉన్నారు. మిగిలిన వారంతా ఉద్వేగాలకు లోనవుతున్నవారే. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంత ముఖ్యమో ఇటువంటి సందర్భాలలోనే తెలుస్తుంది. శరీరంతో పాటు మనసు కూడా శక్తిమంతంగా ఉంచుకోవడానికి ధ్యాస పెట్టాలని ఈ షో చెప్పకనే చెబుతోంది.