అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు
దేశంలో అతి త్వరలోనే బుల్లెట్ రైలు సేవలు ప్రారంభంకానుందన్నారు. ఈ సేవలు తొలుత ముంబై - అహ్మదాబాద్ ప్రాంతాల మధ్య ప్రారంభమవుతాయని కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం కేవలం 2 గంటల 7 నిమిషాలకు తగ్గిపోతుందని వెల్లడించారు. ఆయన ఆదివారం అయోధ్య ఎక్స్‌ప్రెస్, రేవా - పూణె ఎక్స్‌ప్రెస్, జబల్పూర్ - రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించారు.
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి గుజరాత్‌లోని వాపి, సూరత్, వడోదర, అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాలను కలుపుతూ 508 కిలోమీటర్ల పొడవైన హై-స్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం జరుగుతోందని ఆయన తెలిపారు.
గుజరాత్ రాష్ట్రంలో చేపట్టనున్న మరిన్ని రైల్వే ప్రాజెక్టుల గురించి కూడా అశ్విని వైష్ణవ్ ప్రస్తావించారు. పోర్‌బందర్ - రాజ్‌కోట్ మధ్య కొత్త రైలు, రణవావ్ స్టేషన్‌లో రూ.135 కోట్లతో కోచ్ మెయింటెనెన్స్ కేంద్రం, పోర్ బందర్‌లో రైల్వే ఫ్లైఓవర్, రెండు గతి శక్తి కార్గో టెర్మినళ్లు వంటివి రానున్నాయని వెల్లడించారు.
గత 11 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా 34,000 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాకులు వేశామని, ఇది రోజుకు సగటున 12 కిలోమీటర్లతో సమానమని ఆయన గుర్తుచేశారు. రైళ్ల రాకపోకలను నిలిపివేయకుండానే 1,300 రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం భారత రైల్వే చరిత్రలో అపూర్వమైన ఘట్టమని కొనియాడారు.