సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : బుధవారం, 26 జూన్ 2019 (16:18 IST)

బిగ్ బాస్ 3లో అప్పుడే వివాదం.. రజినీ ఫ్యాన్స్ ఫైర్.. ఎందుకు?

దక్షిణాది భాషలలో రెండు సీజన్‌ల పాటు మంచి రేటింగ్‌లతో ముందుకెళ్లిన బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పుడు తమిళంలో సీజన్ 3 గ్రాండ్‌గా జూన్ 23 ఆదివారం ప్రారంభమైంది. ఇది ప్రారంభమై ఇంకా రెండు రోజులు కూడా గడవకముందే వివాదం రాజుకుంది. ఈ కార్యక్రమానికి కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 
 
మొదటి రోజు బిగ్‌బాస్ హౌస్‌లో వైరుమండి చిత్రంలోని కమల్ హాసన్, పేటా చిత్రంలోని రజనీకాంత్ పోస్టర్‌లు కనిపించాయి. అయితే తొలి ఎపిసోడ్ ముగిసిన తర్వాత రెండో రోజు చూసేసరికి రజనీకాంత్ పోస్టర్‌ లేకపోవడం వివాదంగా మారింది. 
 
బిగ్‌బాస్ హౌస్‌లో రజనీకాంత్ పోస్టర్‌ను తొలగించడంపై ఫ్యాన్స్ అసంతృప్తికి గురై, తమ అభిమాన హీరోను అగౌరవపరుస్తారా అంటూ ట్విట్టర్‌లో మండిపడ్డారు. అక్కడితో ఆగకుండా ట్వీట్లు, కామెంట్లతో బిగ్‌బాస్ నిర్వాహకులపై విరుచుకుపడ్డారు.
 
అయితే రజనీకాంత్ పోస్టర్ తొలగింపుపై నిర్వాహకులు వివరణ ఇచ్చారు. ఆ పోస్టర్‌లో రజనీకాంత్ సిగరెట్ తాగుతున్నట్లు ఉండటం వలన తొలగించాం. చట్ట, న్యాయపరమైన సమస్యలు ఎదురుకాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాము. 
 
రజనీకాంత్ అంటే మాకు ఎనలేని గౌరవం ఉంది. ఆయనను అగౌరవపరిచేలా మేము ఎలాంటి పనులు చేయమని బిగ్‌బాస్ షో నిర్వాహకులు వివరణ ఇచ్చారు. తమిళ బిగ్‌బాస్‌లో ఈ మూడో సీజన్‌కు 15 మందిని మాత్రమే తీసుకొన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఆహ్వానించే అవకాశం కూడా ఉంది.