సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (11:56 IST)

పురుషాధిక్యమా... నీకో సవాల్ : ఓవియా

కొన్ని సినిమాలలో నటించిన్పటికీ దక్కని పాపులారిటీ ఒక్క త‌మిళ 'బిగ్‌బాస్' కార్య‌క్ర‌మంతో పొందేసి ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన మ‌ల‌యాళ ముద్దుగుమ్మ ఓవియా. ప్ర‌స్తుతం ఈ అమ్మడు వ‌రుస సినిమా ఆఫ‌ర్ల‌తో బిజీగా ఉంటోంది. ఇటీవ‌ల ఈవిడ న‌టించి, హీరో శింబు సంగీతం అందించిన '90 ఎమ్ఎల్' సినిమా త్వ‌ర‌లో ప్రేక్షకుల ముందుకురాబోతోంది.
 
అయితే... ఈ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్‌లో ఓవియా సిగ‌రెట్ కాల్చ‌డం, మ‌ద్యం సేవించ‌డం కాస్తా వివాదాస్ప‌దంగా మారింది. వ‌చ్చే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు కూడా 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చేసింది. 
 
తాజాగా ఈ సినిమా గురించి ఓవియా మాట్లాడుతూ, "కేవ‌లం ట్రైల‌ర్ చూసి సినిమాను అంచ‌నా వేసేయడం త‌ప్పు. స్వేచ్ఛ‌గా జీవించే మ‌హిళ‌ల మనో భావాలను ఈ సినిమాలో చూపించడం జరిగింది. మ‌హిళ‌లు మద్యం సేవించడం, పొగ త్రాగ‌డం త‌ప్పు అనుకునే పురుషాధిక్య ప్ర‌పంచంలో జీవిస్తున్న‌వాళ్లెవ్వరూ ఈ సినిమాని చూడాల్సిన అవ‌స‌రం లేదు. విడుద‌లైన త‌ర్వాత నేను అభిమానుల‌తో క‌లిసి థియేట‌ర్‌లో ఈ సినిమా చూస్తాను‌" అని సెలవిచ్చింది.
 
మరి ఇది కాన్ఫిడెన్సో.. ఓవర్ కాన్ఫిడెన్సో కానీ... పురుషాధిక్య ప్రపంచంలో జీవించే వాళ్లెవ్వరూ చూడొద్దండి అంటే... మరి ఈ సినిమాని ఎంత మంది చూస్తారో... ఈవిడ ఎంత మంది అభిమానులతో కలిసి ఈ సినిమాని చూస్తుందో... నిర్మాతని ఏం చేస్తారో పాపం... కాలమే నిర్ణయించాలి.