టెక్నాలజీతో మాయ చేస్తున్న సినీ ప్రముఖులు
ఒకప్పుడు మా హీరో కలెక్షన్లు ఇంత వసూలు చేసిందనీ ఒక హీరో అభిమానులు అంటే, పోటీ హీరో అభిమానులు అంతకంటే ఎక్కువ వసూలు చేసిందని లెక్కలు చూపేవారు. అప్పట్లో టెక్నాలజీలేని కాలం. కేవలం వారపత్రికలే లెక్కలకు నిదర్శనాలు. అందులో చూసి అవే నిజమని వేసిన వసూళ్ళు, రాబడి, కలెక్షన్లు రికార్డులు చూసి ఉత్సవాలు జరుపుకునేవారు. అవి ఒక్కోసారి హీరోల మధ్య వ్యత్యాసాలకు కూడా తావిచ్చేవి. రానురాను కాలం మారింది. మేగజైన్ల స్థానంలో ఇప్పుడు సోషల్‌మీడియా వచ్చింది. అందులో యూట్యూబ్ చేరింది. అది అందరికీ వరంలా మారింది. కేవలం ఈ టెక్నాలజీతోనే ప్రచారానికి శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి రాజమౌళి అనే చెప్పకతప్పదు. ఆయన ఏదైనా సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తే దాన్ని అందరూ ఫాలో అయ్యేవారు. పైసా ఖర్చు లేకుండా బాహుబలి వంటి సినిమాను విడుదల చేశాడంటే ఆయన టీమ్ కృషి ఎంతో వుందనేది సినిమావారికి తెలిసిందే. తర్వాత రానురాను లెక్కలు, రికార్డులు సోషల్ మీడియా పుణ్యమా అని మిలియన్ వ్యూస్‌లు నిముషాల్లో వచ్చేస్తున్నాయి. దీనికి ఓ నెట్ వర్క్ వుంది. ప్రతి సినిమాకు సంబంధించి యూనిట్, ప్రత్యేకమైన టీమ్‌ను పి.ఆర్. వ్యవస్థను ఇందుకు ఏర్పాటు చేస్తున్నారు. వీరికి సినిమా ప్రమోషన్‌లో భాగంగా భారీగా వెచ్చిస్తున్నారు. దీనికి సినిమా ప్రమోషన్‌లో భాగంగా వున్న కొంతమంది తమ స్వంత నెట్‌వర్క్‌తో ఫేస్ లెక్కలు చూపిస్తూ హీరోల మధ్య పోటీని పెంచుతున్నారనేది సినిమారంగంలో హాట్ టాపిక్‌గా మారింది.
సోషల్ మీడియా ద్వారా లెక్కలగేమ్!
ఏదైనా సినిమా విడుదలవుతుందంటే ముందుగా ఫస్ట్‌లుక్, సెకండ్ లుక్, గ్లిమ్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇలా రకరకాలుగా సోషల్ మీడియా ద్వారా విడుదలచేయడం ఆనవాయితీ అయిపోయింది. ఇవన్నీ రిలీజ్ చేసేముందు అ్రగ నిర్మాణ సంస్థలకు చెందిన టీమ్ కూడా అందుకు నడుం బిగించింది. ఇలా ఈమధ్య విడుదలైన అ్రగహీరోలకు సంబంధించి టీజర్, ట్రైలర్‌లు ఏకంగా నిముసాల్లో మిలియన్‌లకు మిలియన్‌కు చేరుకోవడం జరిగిపోతుంది. తమ సినిమాకు వ్యూస్, ఇన్ని లైకులు వచ్చాయంటూ డప్పు వేసుకోవలసిందే. ఇవన్నీ చేయడానికి ప్రత్యేక టీమ్ కూడా వుందని టాక్.
ఈ లెక్కలన్నీ చూసిన ఓ ప్రముఖ నిర్మాత ఇన్న వ్యూస్ ఇంతమంది చూస్తే మరి ఒక్కో సినిమాకు పెట్టుబడి పదింతలు రావాలి. కానీ విడుదలైన తర్వాత ఆ సినిమాలను పట్టించుకున్న వారు లేరు. దానిని బట్టి ఈ లెక్కలు, ప్రచారం అంతా హంబేక్ అని స్పష్టం అవుతుందని ఘాటుగా స్పందించారు. ఆయన అన్న మాటల్లో నిజం లేకపోలేదు.
పులినిచూసి నక్కవాత
పులిని చూసి నక్కవాత పెట్టుకున్న చందంగా ఈ అబద్దాల ప్రచారంలో చిన్న సినిమాలు కూడా ముందుంటున్నాయి. మేమేమీ తక్కువకాదనీ వారుకూడా తమ సినిమాకు సంబంధించిన ఏదైన పాటకానీ, టీజర్ కానీ విడుదలైతే మిలియన్స్ వున్నాయంటూ ప్రచారం చేయడం మామూలైపోయింది. ఇదంతా ఓ నెంబర్ గేమ్‌గా మారిపోయింది. ఎవరైనా కొత్తగా సోషల్ మీడియాను పెట్టిన అతి కొద్దిరోజుల్లోనే లక్షల వరకు సబ్‌సైబర్స్ వుండడం, లైక్‌లు లక్షల్లో వుండడం జరిగిపోతుంది. ఇదంతా సాంకేతిక నైపుణ్యం బాగా తెలిసినవారు ఇందుకు పనిచేస్తున్నారని కథనాలు వినిపిస్తున్నాయి. ఈమధ్య బాగా సోషల్‌మీడియాలో ప్రచారం జరిగిన ఓ ప్రముఖ దర్శకుడి సినిమా విడుదలైతే కనీసం థియేటర్‌లో 20మందికూడా లేకపోవడం విశేషం. రిలీజ్‌కుముందు ఆ సినిమాను లక్షల్లో ప్రజలు లైక్‌లు, కామెంట్లు చేశారు. మరి నిజంగా వారంతా చూస్తే సినిమా ఏ రేంజ్‌లో వుంటుందో అర్థం చేసుకోవచ్చు కొందరు నిర్మాతలు తమ చిత్రాలకు క్రేజ్ రావడానికి సొంతగా పి.ఆర్ వ్యవస్థ ద్వారా ఈ సోషల్ మీడియా నంబర్ల గేమ్ కోసం ఖర్చు చేసుకుంటూ ఉంటే, టాప్ స్టార్స్ కు వారి అభిమానుల అండ కూడా లభిస్తూ ఉండడం విశేషం.
ఈ ఫేక్ నెంబర్ సిస్టమ్ కు చెక్ పెట్టాలంటే?
ఈ ఫేక్ లెక్కలు, లైక్‌లు గొడవ కొలిక్కి రావాలంటే సినిమాకు సంబంధించిన దర్శక నిర్మాతలు, హీరోలు కూడా మారాలి. కేవలం ఆడియో సంస్థలకు చెందిన కంపెనీలు మాత్రమే పాటల రూపంలో ఎన్ని మిలియన్ మంది విన్నారు, చూశారు అనేది లాభం చేకూరేది వారికే. ఈ విషయంలో ఒకరకంగా అందరూ ఆడియో కంపెనీలకు లాభాలు తెచ్చిపెడుతున్నారు. సినిమాకు సంబంధించిన ఆదాయ వనరులో ఈ పాట పరంపర ఒకటి. ఆ మధ్య కరోనా టైంలో కొత్త హీరోగా పరియమైన ఓ హీరోకు ఓ పాట ఆయన్ను ఆదుకుంది. తర్వాత ఆ పాటవల్ల సినిమా బాగా ఆడింది. ఆ నిర్మాతకు ఇదే పెద్ద ఆదాయంగా మారింది. ఇది తప్పితే సినిమా విడుదల తర్వాత చాలా సినిమాలు డీలా పడిపోవడానికి కారణం ఈ ఫేక్ లెక్కల వల్లే. ఎవరికి వారు తమను తాము మోసం చేసుకుంటూ లైక్‌లు, కలెక్షన్ల వల్ల సినిమా రికార్డులలో తమ సినిమా మంచి ఆదరణ పొందిన సినిమా చూపించుకోవడం మినహా ఒరిగేది ఏమీ లేదనే విమర్శ వుంది. ఇది వరకు బాగాలేకపోయినా సినిమా కూడా బాగా ఆడినట్లు ప్రమోషన్‌లు చేసుకుంటే కనీసం శాటిలైట్ వారు కొనేవారు. ఇప్పుడు అది కూడా పోయింది. ఆ ఫేక్ లెక్కలు వారికి అర్థమయి శాటిలైట్ బిజినెస్ ఆగిపోయింది. ఏది పడిదే అది కొనేస్థితిలో వుండకూడదని ప్రముఖ ఛానల్స్ నిర్ణయించుకున్నాయి. సేమ్ సేమ్ టు ఇదే ఒరవడి ఫేక్ కలెక్షన్లుపై పడితే కానీ వీటికి ఫుల్‌స్టాప్ పెట్టవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.