శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (12:01 IST)

వకీల్ సాబ్ ప్రభంజనం : కోవిడ్ నిబంధలు గల్లంతు.. థియేటర్లు సీజ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొత్త చిత్రం "వకీల్ సాబ్". వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించి, దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అంజలి, నివేదా, అనన్యలు హీరోయిన్లుగా నటించారు. శృతిహాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించింది. ఈ నెల 9వ తేదీన విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విడుదలైన ప్రతిచోటా ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో కొవిడ్‌ నిబంధనలు ఒక్కరంటే ఒక్కరు కూడా పాటించడం లేదు. ఈ నిబంధనలు పాటించని రెండు సినిమా థియేటర్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళ్తే.. ఒరిస్సా రాష్ట్రంలోని గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణంలో రెండు థియేటర్లలో వకీల్‌ సాబ్‌ విడుదలైంది. దీంతో సినిమాను చూసేందుకు ఆదివారం పవన్‌ అభిమానులు అత్యధిక సంఖ్యలో సినిమా హాళ్ల వద్దకు చేరుకున్నారు. 
 
ఈ క్రమంలో సినిమాహాళ్ల యాజమాన్యాలు కొవిడ్‌ నిబంధనల్ని పట్టించుకోకుండా వ్యవహరించాయని ఆరోపిస్తూ పర్లాఖెముండిలోని థియేటర్లపై జిల్లా అధికారులు చర్యలకు దిగారు. నిబంధనలు పాటించని రెండు సినిమా హాళ్లకు తాత్కాలికంగా సీల్‌ వేశారు. 
 
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన కొవిడ్‌ నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలంటూ తేల్చి చెప్పారు.