నోటికొచ్చినట్లు పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు... పేట నిర్మాతకు కౌంటర్ ఇచ్చిన దిల్ రాజు..!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం పేట. ఈ చిత్రాన్ని తెలుగులో వల్లభనేని అశోక్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 10న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. అయితే... ఈ నెల 9న ఎన్టీఆర్ కథానాయకుడు, 11న చరణ్ వినయ విధేయ రామ, 12న వెంకీ - వరుణ్‌ల ఎఫ్2 చిత్రాలు రిలీజ్ అవుతుండడంతో రజనీకాంత్ పేట సినిమాకు థియేటర్లు దొరకడం లేదు. దీంతో ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నిర్మాత వల్లభనేని అశోక్.. యు.వి.క్రియేషన్స్, దిల్ రాజు, అల్లు అరవింద్‌ల చేతిలో థియేటర్లు ఉన్నాయని.. ఇదొక మాఫియా.. ఇలాంటి వాళ్లను నయింను షూట్ చేసినట్టుగా షూట్ చేయాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
ఈ వ్యాఖ్యలకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు కౌంటర్ ఇచ్చాడు. ఇంతకీ ఏమన్నాడంటే... సంక్రాంతికి తెలుగు నుంచి మూడు పెద్ద సినిమాలొస్తుంటే, ఓ అనువాద చిత్రానికి థియేటర్లు ఎలా దొరుకుతాయని అనుకుంటున్నారు? అంటూ ప్రశ్నించారు. మూడు నెలల క్రితమే.. సంక్రాంతి సినిమాలు థియేటర్స్‌కి సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నాయని.. ఇప్పటికిప్పుడు వచ్చి డబ్బింగ్ సినిమాకి కూడా థియేటర్లు కావాలని అడగటంలో న్యాయం లేదన్నారు దిల్ రాజు. నోటికొచ్చినట్టు పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు. మేమూ మాట్లాడగలం. కానీ నాకు క్యారెక్టర్ ఉంది. నేను దిగజారలేను.
ఇక్కడ మనం చేస్తోంది వ్యాపారం. పంపిణీలో ఈమధ్య నాకు చాలా నష్టాలొచ్చాయి. కానీ సినిమాపై అభిరుచితో.. సినిమాలు తీస్తున్నాం. మూడు సినిమాలూ క్రేజీ సినిమాలే. ఎన్టీఆర్ బయోపిక్ ప్రతిష్టాత్మక చిత్రం. రామ్ చరణ్ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఎఫ్ 2 ఓ క్రేజీ సినిమా. ఇలాంటి తెలుగు సినిమాల్ని తగ్గించుకుని డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఇవ్వలేం కదా? 18 వరకూ ఆగితే.. రెండు రాష్ట్రాల్లోనూ థియేటర్లు దొరుకుతాయి కదా? ఇదంతా అర్థం చేసుకుని మాట్లాడితే మంచిది అన్నారు.