'ఎంపురాన్'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్
తాను నటించిన కొత్త చిత్రం 'ఎంపురాన్'లోని కొన్ని సన్నేవేశాను తన ప్రియమైన వారిని బాధించాయని, అందుకు క్షమాపణలు చెపుతున్నట్టు ఆ చిత్రం హీరో మోహన్ లాల్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటించిన చిత్రం "ఎల్2 ఎంపురాన్". ఈ నెల 27వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించి, కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. అయితే, ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదమయ్యాయి.
గత 2002లో గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. అల్లర్ల సమయంలో ఓ కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన నాయకుడు దారుణంగా హత్య చేయడం, కొంతకాలానికి అతడే రాజకీయాల్లో అడుగుపెట్టడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ సన్నివేశాలను చాలామంది తప్పుబడుతున్నారు. ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపించేలా ఈ సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ, సినిమాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
దీంత మోహన్ లాల్ సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పారు. రాజకీయ సామాజిక అంశాలు కొన్ని 'ఎంపురాన్' సినిమాలో భాగమయ్యాయని, తనకు ప్రియమైన కొందరిని అవి బాధించాయని తెలిపారు. ఏ రాజకీయ ఉద్యమాన్ని, భావజాలాన్ని, మతాన్నితన సినిమాలు కించపరచకుండా చూడటం ఒక నటుడుగా తన బాధ్యత అని పేర్కొన్నారు. కాబట్టి తన తరపున, తన చిత్రంబృందం తరపున క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు.
ఆ సన్నివేశాలను తొలగించాలని నిర్ణయించినట్టు వివరించారు. గత నాలుగు దశాబ్దాలుగా మీలో ఒకడిగా ఉంటున్నానని, మీ ప్రేమ, నమ్మకమే తన బలమని అభిమానులను ఉద్దేశించి మోహన్ లాల్ పోస్ట్ చేశారు. కాగా, ఈ చిత్రాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిలకించారు.