కష్టాల్లో మాస్ మహారాజా... ముందుకురాని నిర్మాతలు..
మాస్ మహారాజా రవితేజతో సినిమా అంటే ఇదివరకు చాలా మంది ప్రొడ్యూసర్‌లు క్యూ కట్టేవారు. సక్సెస్ రేట్ కూడా బాగానే ఉండేది. తన ప్రతిభతో అందరినీ అలరించాడు. అయితే ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది. రవితేజతో సినిమాకి ఎవరూ మొగ్గుచూపడంలేదు. గతేడాది మూడు మాస్ సినిమాలు తీసినా అవి ఒకటికి మించి ఒకటి డిజాస్టర్‌గా మిగిలిపోవడంతో మార్కెట్ దెబ్బతింది. అభిమానులు ఎలాగోలా సర్దుకున్నా బయ్యర్లు మాత్రం భారీ పెట్టుబడులు పెట్టడానికి వెనుకంజ వేస్తున్నారు.
ఏ ఒక్కటీ కనీసం రూ.10 కోట్ల షేర్ రాబట్టలేకపోవడం పరిస్థితికి తార్కాణం. ఇదిలావుంటే, ఆ మధ్య విఐ ఆనంద్ దర్శకత్వంతో "డిస్కోరాజా"ని ఆర్భాటంగా ప్రారంభించి, పూజలు పురస్కారాలు కూడా చేసారు. దీంతో ఇది క్రమం తప్పకుండా కొనసాగుతుందని అందరూ భావించారు. కానీ ప్లేటు ఫిరాయించింది. దానిని వాయిదా పడినట్లు తెలుస్తోంది. దానికి బదులుగా రెండేళ్ల నుంచి బౌండెడ్ స్క్రిప్ట్‌తో మైత్రి ఆఫీస్‌లో రెడీగా ఉన్న దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌తో "తేరి" రీమేక్ చేయడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం.
కనకదుర్గ టైటిల్‌తో రిజిస్టర్ చేశారనే ప్రచారం దానికి మరింత బలాన్ని చేకూర్చింది. విజయ్ నటించిన తేరి రెగ్యులర్ పోలీస్ కమర్షియల్ మూవీ. ఇందులో కొత్తగా ఏమీ ఉండదు. కాకపోతే మాస్ హీరోయిజంని ప్రదర్శిస్తుంది. డిస్కో రాజాని ప్రక్కన బెట్టే అంత విశిష్ట అంశాలు ఇందులో ఉన్నాయా అంటే చెప్పడం కష్టం. ఇది అధికారిక ప్రకటన కాకపోయినప్పటికీ ప్రచారం మాత్రం జోరందుకుంది.