జూనియర్ ఎన్టీఆర్ సరసన జాహ్నవి? కన్నేసిన రాజమౌళి

sridevi - jahnavi
సందీప్| Last Updated: మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (13:56 IST)
'బాహుబలి' తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, డీవీవీ దానయ్య హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఇటీవల చిత్ర యూనిట్‌ని పరిచయం చేశారు. ఎన్టీఆర్ సరసన బ్రిటన్ భామ డైసీ ఎడ్గర్ జోన్స్, రాంచరణ్ సరసన అలియాభట్ నటించబోతున్నట్లు ప్రకటించారు. అయితే షూటింగ్‌కి కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. రాంచరణ్‌కి గాయాలు కావడంతో పూణే షెడ్యూల్‌ని వాయిదా వేసారు. డైసీ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు బాంబు పేల్చడంతో దర్శకుడు ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తున్నారు.

కుటుంబ పరిస్థితుల కారణంగా డైసీ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు వెల్లడించింది. హఠాత్తుగా ఈ నిర్ణయం చెప్పడంతో ఆమె స్థానంలో ఎవరిని ఉంచాలా అనే ఆలోచనలో పడ్డారు. ఇందుకు ఇద్దరు హీరోయిన్లలో ఒకరిని ఎంపిక చేసుకోనున్నట్లు సమాచారం. శ్రద్ధాకపూర్, జాహ్నవి కపూర్‌లపై రాజమౌళి దృష్టి ఉన్నట్లు తెలుస్తోంది. శ్రద్ధాకపూర్ "సాహో" చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా ద్వారా ఆమె టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు.

ఇప్పటికే 'సాహో'లో ఆమె పాత్ర గురించి బాగా చెప్పుకుంటున్నారు. దీంతో తెలుగు సినిమా వాతావరణంతో ఇప్పటికే పరిచయం ఉన్న కారణంగా శ్రద్దాకపూర్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ విషయమై 'సాహో' యూనిట్‌తో చర్చలు జరిగాయి. ఇక మంచి ప్రాజెక్ట్ దొరికితే జాహ్నవి కపూర్‌ దక్షిణాదిలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో జాహ్నవి కపూర్‌పై రాజమౌళి దృష్టిపెట్టినట్టు సమాచారం.

అయితే అత్యంత భారీ ప్రాజెక్టు కావడం, ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతున్నందున జాహ్నవి నటించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని రూ.400 కోట్ల వ్యయంతో తెరకెక్కిస్తున్నారు. సముద్రఖని, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తదితర నటులు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రం 2020 జూలై 30న విడుదల కాబోతోంది.దీనిపై మరింత చదవండి :