బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (10:43 IST)

రాజమౌళి పిలుపుకు భారీగా రెస్పాన్స్... టైటిల్ రేసులో ఆ మూడు పేర్లు

దేశవ్యాప్తంగా భారీ బడ్జెట్ సినిమాలలో ఒకటిగా రూపొందుతున్న "ఆర్ఆర్ఆర్" కథనం, పాత్రల గురించి రాజమౌళి ఇటీవల ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పిన తర్వాత దేశం మొత్తం ఆ సినిమాపై క్రేజ్ పెరిగింది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 1920 కాలం నాటి నేపథ్యంలో స్వాతంత్ర ఉద్యమకారులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు యుక్త వయసులో కొన్నేళ్ల పాటు కనిపించకుండాపోయి తిరిగి వచ్చి స్వాతంత్ర పోరాటం చేశారు. 
 
అదృశ్యమైన సమయంలో వీరి జీవితంలో జరిగిన పరిణామాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు రాజమౌళి తెలిపారు. ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఇక 'ఆర్ఆర్ఆర్' అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే కావడంతో దీనికి మంచి అర్థం వచ్చేలా టైటిల్ ఇస్తే దాన్ని పెడతామని రాజమౌళి అభిమానులకు పిలుపునిచ్చారు.
 
దీంతో ప్రేక్షకుల నుండి భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఆర్ఆర్ఆర్ టైటిల్‌ను ఒక్కో భాషలో ఒక్కో పేరు నిర్ణయిస్తామని తెలిపారు. అభిమానులు అందించిన వాటిలో 'రఘుపతి రాఘవ రాజారాం', 'రం రం రుధిరం', 'రౌద్ర రణ రంగం' అనే మూడు టైటిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'రామ రావణ రాజ్యం' అనే టైటిల్ ముందు నుండి ప్రచారంలో ఉండటంతో బహుశా సినిమా యూనిట్ మనస్సులో ఉండే టైటిల్ ఇదేనేమో అనే చర్చ కూడా ఒకపక్క జరుగుతోంది. అభిమానులు అందిస్తున్న టైటిల్స్‌తో సంతృప్తి చెందుతారా లేక తాము నిర్ణయించుకున్న టైటిల్ పెడతారా అనేది వేచి చూడాల్సిందే మరి.