గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2023 (10:25 IST)

యాత్ర 2 లో సోనియా పాత్రలో జర్మనీ నటి సుజానే బెర్నెర్ట్

Suzanne Bernert as Sonia
Suzanne Bernert as Sonia
మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘యాత్ర 2’. ఇందులో వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి, వై.ఎస్‌.జ‌గ‌న్‌ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. యాత్ర 2లో సోనియా పాత్ర‌ను జ‌ర్మ‌నీ న‌టి సుజానే బెర్నెర్ట్ పోషించారు. ఆమె పాత్ర‌కు సంబంధించిన లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ మంగళవారం విడుద‌ల చేశారు. 
 
సుజానే బెర్నెర్ట్ జ‌ర్మ‌నీలో పుట్టి పెరిగారు. క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌, హిందీ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ సీరియ‌ల్స్‌లో న‌టించారు. ఆమె సోనియాగా ఎలా మెప్పించ‌బోతున్నార‌నేది ఆస‌క్తికంగా మారింది. యాత్ర 2కి సోనియాకి ఉన్న సంబంధం ఏంట‌నేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌. 
 
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర  ఆధారంగా ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించారు. అత్యంత ప్ర‌జాద‌ర‌ణను పొందిన ఈ చిత్రంకు కొన‌సాగింపుగా, వైఎస్‌.ఆర్ త‌న‌యుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా నాయ‌కుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఇప్పుడు ‘యాత్ర 2’ని తెర‌కెక్కిస్తున్నారు. ‘యాత్ర’ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 8, 2019లో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు, 2024 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మవుతుంది. 
 
ప్రస్తుతం శ‌ర‌వేగంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మది కెమెరామెన్. సంతోష్ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.