గోపీచంద్ మూవీకి మోక్షం లభించినట్టేనా..?
గోపీచంద్ - బి.గోపాల్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఆరడుగుల బుల్లెటు. ఇందులో గోపీచంద్ సరసన అందాల తార నయనతార నటించింది. వక్కంతం వంశీ కథ అందించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. మాస్ ప్రేక్షకులే టార్గెట్‌గా రూపొందింది ఈ సినిమా. నిజానికి ఈ సినిమా 2012లో ప్రారంభమైంది. తమిళ దర్శకుడు భూపతి పాండియన్ దర్శకత్వంలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంగా దీన్ని ప్రారంభించారు.
అయితే...ఫస్ట్ ఈ మూవీకి జగన్‌మోహన్ ఐపీఎస్ అనే టైటిల్ పెట్టారు. అయితే.. గోపీచంద్ ఇమేజ్‌కు తగ్గట్టు తెలుగు స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని నిర్మాత తాండ్ర రమేష్ పట్టుబట్టడంతో భూపతి తప్పుకున్నారు. దీంతో ఇదే ప్రాజెక్ట్‌ను వక్కంతం వంశీ ఇచ్చిన కథతో బి.గోపాల్ దర్శకత్వంలో తిరిగి ప్రారంభించారు. బి.గోపాల్ ఎంటర్ అయిన తర్వాత ఈ చిత్రానికి ఆరడుగుల బుల్లెట్ అని టైటిల్ పెట్టారు. అంతా సాఫీగా జరుగుతుంది అనుకుంటే... ఆర్థిక ఇబ్బందులతో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
ఆ తర్వాత నిర్మాత పీవీపీ ఈ ప్రాజెక్ట్‌ను చేతులోకి తీసుకుని 9 కోట్లు పెట్టుబడి పెట్టారు. 2017లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఫైనాన్సియర్స్ తమకు ఇవ్వాల్సిన మొత్తం కట్టాలని పట్టుబట్టడంతో మళ్లీ ఆగిపోయింది. ఇప్పుడు థియేటర్స్ అన్ని మూతపడడంతో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి నిర్మాతకు భారీ ఆఫర్ వచ్చిందని.. నిర్మాత కూడా సముఖుంగా ఉన్నారని తెలిసింది. ఇదే వాస్తవం అయితే... గోపీచంద్ ఆరడుగుల బుల్లెటుకు మోక్షం లభించినట్టే. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.