శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : బుధవారం, 26 జూన్ 2019 (18:08 IST)

300 మంది పిల్లల చదువు బాధ్యత నాదే.. టాలీవుడ్ హీరో గొప్పతనం

హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన యువ కథానాయకుడు నిఖిల్‌ తన మంచి మనసును చాటుకున్నారు. నిఖిల్‌ ‘కిర్రాక్‌ పార్టీ’ సినిమా తర్వాత టీఎన్‌ సంతోష్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్‌ సురవరం’ సినిమాలో నటించారు. ఇందులో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించింది. ఈ సినిమా ఆశించిన మేరకు విజయం సాధించలేకపోయింది. 
 
ఇక ఇప్పుడు నిఖిల్‌ ‘కార్తికేయ 2’లో నటించబోతున్నారు. దీనికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాణ బాధ్యతలను చూసుకుంటోంది. జూన్‌ 1న నిఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని సినిమా యూనిట్ ప్రకటించింది.
 
నిఖిల్ చేసిన మంచి పనికి అందరి నుండి ప్రశంసలు అందుతున్నాయి. ఆయన భీమవరంకు చెందిన 300 మంది చిన్నారుల చదువుకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని మంగళవారం ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
పాఠశాలలో విద్యార్థులతో కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ.. ‘భీమవరానికి చెందిన ఈ 300 మంది చిన్నారులు పాఠశాలకు వెళ్లడం నుంచి చదువు పూర్తయ్యే వరకూ అన్నీ బాధ్యతలు చూసుకుంటా. ఈ గొప్ప పనిలో నాకు భాగస్వామ్యం కల్పించిన మహేందర్‌, రాంబాబుకు ధన్యవాదాలు చెప్తున్నాను. భవిష్యత్తులో ఇంకా మరికొంత మంది చిన్నారుల అభివృద్ధికి తోడ్పడతాను’ అని నిఖిల్‌ ట్వీట్‌ చేశారు.