సినిమా టిక్కెట్ల రేటు పెంపు 10 రోజులు చాలు : సర్కారుకు హైకోర్టు
రామ్ చరణ్ హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్', నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' చిత్రాలకు సినిమా టిక్కెట్ల రేటు 10 రోజులకే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సినిమా టికెట్ల రేటు పెంపు విషయంలో గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్' సినిమా టికెట్ల రేట్ల పెంపు, అధిక షోల ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతించడాన్ని సవాల్ చేస్తూ గుంటూరుకు చెందిన అరిగెల శ్రీనివాసులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా... పిటిషనర్ తరపు న్యాయవాది శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపించారు. టికెట్ ధరలను 14 రోజులు పెంచుకొనేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మెమో ఇచ్చిందన్నారు. సినిమా హీరోలు ముఖ్య మంత్రి, ఉపముఖ్యమంత్రి బంధువులు కావడంతోనే ప్రీమియర్ షో టికెట్ ధర పెంపునకు అనుమతిచ్చారన్నారు. ప్రీమియర్ షో వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. 'గేమ్ ఛేంజర్' సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు చనిపోయారని గుర్తుచేశారు. అర్థిరాత్రి ప్రీమియర్ షోను రద్దు చేయాలని కోరారు.
ధర్మాసనం స్పందిస్తూ, 'రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి వెళ్లి వస్తూ వాహన ప్రమాదానికి గురై వ్యక్తులు మరణించారనే కారణంతో శ్రీహరికోటలో ప్రయోగాలు నిలిపి వేయాలన్నట్లు మీ అభ్యర్థన ఉంది' అని వ్యాఖ్యానించింది. ప్రస్తుత పిల్‌పై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.