బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (11:29 IST)

ధనుష్‌ సార్‌ పాఠాలు ఎలా వున్నాయంటే, రివ్యూ రిపోర్ట్‌

Dhanush-sar
Dhanush-sar
నటీనటులు: ధనుష్‌, సంయుక్తమీనన్‌, తనికెళ్ళభరణి, సాయికుమార్‌, సముద్రఖని, హైపర్‌ ఆది తదితరులు
సాంకేతికత:కెమెరా: కె. యువరాజ్‌, సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్‌, ఎడిటర్‌: నవీన్‌ నూలి, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, దర్శకత్వం: వెంకీ అట్లూరి. 
విడుదల: ఫిబ్రవరి 17. 
 
తమిళ హీరో ధనుష్‌ ఎప్పటినుంచో తెలుగులో సినిమా చేయాలనుకుంటున్నట్లు చెబుతూనే వున్నాడు. తిరు, మారన్ వంటి కొన్ని సినిమాలు సక్సెస్‌ అయ్యాయి. అయితే అన్నీ డబ్బింగ్‌ సినిమాలే. నేరుగా తెలుగు సినిమాగా తమిళం (వాతి), తెలుగులో (సార్‌) సినిమాగా నేడే విడుదల అయింది. మిస్టర్‌ మజ్ఞు, రంగ్‌దే, తొలిప్రేమ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ శిష్యుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. కథపై పూర్తి నమ్మకంతో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ భార్య సాయి సౌజన్య ఓ నిర్మాత కావడం విశేషం. అంతలా ఆకట్టుకునే అంశం ఏమిటి? అనేది తెలియాలంటే సార్‌ సమీక్షలోకివ వెళ్ళాల్సిందే.
 
కథగా చెప్పాలంటే..
ఓ ఊరిలో కారు డ్రైవర్‌ కొడుకు బాలగంగాధర్‌ తిలక్‌ (ధనుష్‌) మ్యాథ్స్‌లో ప్రావీణ్యుడు. త్రిపాఠి (సముద్రఖని) విద్యాసంస్థలో జూనియర్ లెక్కల మాస్టర్‌గా పనిచేస్తాడు. ప్రభుత్వ కాలేజీలు నడపలేని స్థితిలో వుంటే ప్రభుత్వంతో సరికొత్త జీఓ తెప్పించి ఆ కాలేజీలను త్రిపాఠి దత్తత తీసుకుంటాడు. అలా కొన్ని కాలేజీలకు తన సంస్థలో పనిచేస్తున్న జూనియర్‌ లెక్చర్లను పంపిస్తాడు. కాలేజీలో రేంక్‌లు బాగా వచ్చేటట్లు చేస్తే మిమ్మల్ని సీరియర్‌ లెక్చరర్‌గా ప్రమోట్‌ చేస్తానని ఆశచూపుతాడు. ఆ స్పూర్తితో సిరిపురం ప్రభుత్వ కాలేజీకి ధనుష్‌, హైపర్‌ అది, మరో వ్యక్తి లెక్చరర్లుగా వస్తారు. ఎన్నాళ్ళుగానే మూతపబడిన ఆ కాలేజీకి ఊరిలో యూత్‌ను ఎలా రప్పించి వారిచేత చదువులో తన టార్గెట్‌ పూర్తి చేశాడు? ఆ క్రమంలో బాలుకు త్రిపాఠినుంచి, ఊరి ప్రెసిడెంట్‌ నుంచి ఎదురైన సవాళ్ళు ఏమిటి? సంయుక్త మీనన్‌ ఎవరు? చివరికి బాలుకు ప్రమోషన్‌ వచ్చిందా? అనేది మిగిలిన కథ.
 
విశ్లేషణ:
విద్యావిధానంపై ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆమధ్య అక్షర అనే సినిమా కూడా వచ్చింది. ఫ్లాప్‌ బ్యాక్‌లోకి వెళితే ఎన్‌.టి.ఆర్‌., ఎ.ఎన్‌.ఆర్‌. చిత్రాలూ వున్నాయి. గ్రామాల్లోని  పాఠశాలలను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఫండ్‌ విడుదల చేస్తుంటే వాటిని ఊరి ప్రెసిడెంట్‌ హోదాలో నాగభూషణం వంటి వారు స్వప్రయోజనాలకు వాడుకుని గోదెలు కట్టించి ఊరిని ఎలా నాశనం చేశారో చూపించారు. వీటికన్నింటికీ ముందే వేజెళ్ళ సత్యనారాయణ, మాదాల రంగారావు, టి. కృష్ణ వంటివారు కూడా తమ చిత్రాలలో విద్యావిధానం ఏ తీరుగా నాశనం అయిందో చూపారు. 
 
కాలం మారింది. పరిస్థితులు మారాయి. ప్రభుత్వ విధానాలు అలాగే వున్నాయి. దాంతో ప్రైవేట్‌ విద్యావిధానం పుంజుకుంది. ఈమధ్య తరచుగా దినపత్రికలలో కోట్లను వెచ్చించి ప్రకటనల రూపంలో మా సంస్థలో అందారూ టాపర్స్‌ అంటూ రకరకాల ప్రైవేట్‌ విద్యాసంస్థలు వేయడం చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్న సందర్భాలు వున్నాయి. ఫేక్‌ రిజల్ట్‌లను చూపించి విద్యార్థుల జీవితాలతో వారి తల్లిదండ్రుల జీవితాలతో ఆడుకుంటున్న సందర్భాలు చాలానే వున్నాయి. అటువంటి అంశాన్ని ఎంచుకుని తీసిన సినిమా ఇది. 
 
ఈ సినిమాలో విద్యాసంస్థను దేవాలయంగా చూడాలి. విద్య గుడిలో నైవేద్యం లాంటిది. పంచండి. ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో డిష్‌లా అమ్మకండి అంటూ బాలు, త్రిపాఠితో అన్న సంభాషణలు వర్తమానానికి నిదర్శనం. అయితే దానికి కౌంటర్‌గా.. విద్యార్థులు అనేవారు మాకు కస్టమర్లు అంటూ త్రిపాఠి చెప్పిన సంభాషణలు విద్యావ్యవస్థను ఏరూపంలో ప్రైవేట్‌ సంస్థలు చూస్తున్నాయనేది తెలియజేశాడు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు తమ పిల్లల జీవితాలు బాగుపడాలని తినకుండా కడుపు మాడ్చుకుని ఆస్తులు అమ్ముకుని చదివిస్తున్న సందర్భాలూ ఎరిగినవే. ఆ సన్నివేశాలు ఇందులోనూ చూపించారు.
 
అందుకే విద్యార్థులకు మెరుగైన విద్యను అభ్యసించేలా చేస్తానని ప్రతిన బూనిన బాలుకు ప్రైవేట్‌ సంస్థలనుంచి ఎదురైన సవాళ్ళను ఏవిధంగా ఎదుర్కొన్నాడు. వారికి చదువు ఎలా చెప్పాడనే పాయింట్‌ సరికొత్తగా వుంది. 1990 కాలంనాటికి వీడియోషాప్‌లు, వీడియోలున్న రోజులు. వాటిని విద్యావిధానానికి ఎలా మలిచాడు. బూతు సినిమాలు ప్రదర్శించే టూరింగ్‌ టాకీస్‌ను ఫైనల్‌గా కాలేజీగా ఎలా మార్చగలిగాడు అన్నది సినిమాటిక్‌గా వున్నా ఆలోజింపచేసేదిగా వుంది. 
 
ఎం.సెట్‌లో టాప్‌ 10 ర్యాంక్‌లో నిలిచిన దిగువమధ్యతరగతి సిరిపురం విద్యార్థులకు త్రిపాఠి ఏవిధంగా ఆఫర్లు ఇచ్చాడనేది ఆమధ్య చాలాచోట్ల పత్రికలలో ఓ మూల వచ్చిన విషయమే. ఏది మంచి కాలేజీ. ఏది కాదు. అసలు లెక్చరర్‌ అంటే స్టూడేంట్స్ ను  ప్రేమించేవాడు. పిల్లలు లెక్చరర్‌ను ప్రేమించే కథలు, విద్యార్థులు టీచర్‌ను, లెక్చరర్‌ను టీజ్‌చేసే విధానంతో సినిమాలు వచ్చిన సందర్భాలున్నాయి. వాటిని ఓ వర్గం కోసం తీశామని చెప్పే దర్శక నిర్మాతలకు, అందులో నటించిన నటీనటులకు చెంపపెట్టుగా ఈ సినిమా వుంటుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. 
 
అసలు విద్య నేర్చుకోవాలంటే బుర్రకాదు మనీకావాలనేలా ప్రోత్సహించిన ప్రభుత్వ నియమాలను ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది. అందుకే దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, దర్శకుడు వెంకీ అట్లూరి తమ అనుభవాలను, చుట్టుపక్కల పరిస్థితులను గమనించి తీసిన సినిమాగా వుంది. ఇలాంటి సినిమాను ఆదరించాల్సిన అవసరం అందరికీ వుంది.
 
ఇక సంగీతం, సాహిత్యపరంగా రెండే పాటలున్నా బాగున్నాయి. నటీనటుల అభినయం అందరిదీ బాగుంది. దర్శకుడు తను ఏం చెప్పదలచాడనేది నేరుగా చెప్పేశాడు. ఇది ఇప్పటి తరానికి స్పూర్తిగా వుంది. మెరిట్‌ స్టూడెంట్స్‌ను ప్రైవేట్ వారు తమ స్టూడెంట్‌గా చెప్పుకున్నా పర్వాలేదంటూ ఆ తర్వాత మీరు ఏం చేయాలనేది బాలు సార్‌ చెప్పిన అంశం చాలా కన్‌వీనియన్స్‌గా వుంది. ఇప్పటి తరంలో అదే చేయాలి కూడా. ఇలాంటి సినిమా తీసిన నిర్మాతలను ముందుగా అభినందించాలి. ప్రతిఒక్కరు చూడాల్సిన సినిమా. అవార్డుకు పంపాల్సిన చిత్రంగా సార్ నిలుస్తుంది.
 
రేటింగ్: 3 / 5