వణికిపోతున్న భాగ్యనగరి : కదిలిన తెలుగు చిత్రపరిశ్రమ .. విరాళాల వెల్లువ
గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో భాగ్యనగరి వణికిపోతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. జన జీవితం అస్తవ్యస్తంగా మారింది. వేలాది కుటుంబాలకు చెందిన ప్రజలు నిరాశ్రుయులయ్యారు. వీరిని ఆదుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణ సాయం కింద రూ.550 కోట్లు విడుదల చేశారు.
అంతేకాకుండా, బాధితులని ఆదుకునేందుకు పలువురు ముందుకు రావాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ పిలుపునకు టాలీవుడ్ ఇండస్ట్రీ స్పందించింది. ఇందులోభాగంగా మెగాస్టార్ చిరంజీవి తన వంతు సాయంగా కోటి రూపాయలు ప్రకటించారు. అలాగే, సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకూడా రూ.కోటి రూపాయలు, అక్కినేని నాగార్జున రూ.50 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ రూ.50 లక్షలు, విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు, దర్శకులు హరీష్ శంకర్, అనీల్ రావిపూడి చెరో రూ.5 లక్షలు విరాళం అందివ్వనున్నట్టు ప్రకటించారు.
ఇదే అంశంపై చిరంజీవి ట్వీట్ చేస్తూ... "గడిచిన వందేళ్ళలో ఎప్పుడు లేనివిధంగా కుండపోతగా కురిసిన వర్షాల వలన హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. అపార ప్రాణనష్టంతో పాటు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి భీభత్సంతో అల్లాడిపోతున్న వారికి నా వంతు సాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి కోటి రూపాయల విరాళం ప్రకటిస్తున్నాను. ఎవరికి వీలైనంత వాళ్ళు సాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను" అని చిరు తన ట్వీట్ లో పేర్కొన్నారు.
అలాగే, నాగార్జున ట్వీట్ చేస్తూ, 'భారీ వర్షాలు, వరదల వలన హైదరాబాద్ నగర ప్రజల జీవితం దుర్భరంగా మారింది. వారి బాగోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ.550 కోట్లు విడుదల చేయడం హర్షణీయం. ఈ విపత్తు వలన నిరాశ్రయులైన వారికి నా వంతు సాయంగా రూ.50 లక్షల రూపాయలని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వనున్నాను' అని నాగార్జున పేర్కొన్నారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్‌లో వర్షాలు, వరదలతో హైదరాబాద్‌లో చాలా మంది జీవితాలు నాశనమయ్యాయి. మన నగర పునరావాసం కోసం తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్‌కు 50 లక్షల రూపాయలు అందిస్తున్నాను. మనమందరం చేతనంత సాయం చేసి హైదరాబాద్‌ను పునర్నిర్మించుకుందాం' అంటూ పేర్కొన్నారు.
'గతంలో వరదలు వచ్చినప్పుడు కేరళ, చెన్నై ప్రజలకు సాయం చేశాం. ఆర్మీకు కూడా మనవంతు సాయం చేశాం. కరోనా సమయంలోను విరాళాలు అందించాం. ఇప్పుడు మన నగరాన్ని రక్షించుకోడానికి అందరం కలిసి ముందుకు సాగాలి. ఇందుకుగాను నా వంతు సాయంగా రూ.10 లక్షల విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించాను' అంటూ కుర్రహీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ, నగదు బదిలీ చేసిన రిసిప్ట్‌ను కూడా అటాచ్ చేశారు.