రాహుల్ యాదవ్ తీసిన సినిమాలకు నేను అభిమానిని: దిల్ రాజు
Rahul Yadav, Dil Raju and others
మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూపొందిన మూడో చిత్రం మసూద. హారర్-డ్రామా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ విషయం తెలిపేందుకు బుధవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు, చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ నక్కాతో పాలు చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. రాహుల్ యాదవ్ ఇంతకు ముందు తీసిన రెండు సినిమాలకు నేను అభిమానిని. కొత్త నిర్మాత. మళ్లీరావాతో గౌతమ్‌ని పరిచయం చేశాడు.. తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో స్వరూప్‌ని డైరెక్టర్‌గా, నవీన్ పోలిశెట్టిని హీరోగా పరిచయం చేశాడు. నవీన్‌కి ఆ సినిమా ఎంత ప్లస్ అయ్యిందో తెలిసిందే. ఆ రెండు సినిమాలకు నేను అభిమానిని. రాహుల్ అభిరుచిగల నిర్మాత. ఆ రెండు సినిమాల జర్నీ నాకు నచ్చి.. అప్పుడే రాహుల్‌కి మాటిచ్చాను.. తర్వాత ఏదైనా సినిమా ఉంటే.. నువ్వు నిర్మించిన తర్వాత మా ద్వారా రిలీజ్ చేద్దాం అని చెప్పాను. ఈ మీడియా సమావేశానికి కారణం ఇదే. ఆయన నిర్మించిన మసూద చిత్రాన్ని మా ఎస్‌విసి ద్వారా రిలీజ్ చేయబోతున్నాం. ఈ సినిమా టీజర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. టీజర్ చూడగానే రాహుల్‌కి ఫోన్ చేసి చెప్పాను. ఈ సినిమాతో కూడా కొత్తవారిని పరిచయం చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా చూడబోతున్నాను. ఫైనల్ కాపీ చూసేందుకు ఐయామ్ వెయిటింగ్. రాహుల్‌తో అసోసియేట్ అవడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. నవంబర్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్స్ కూడా మొదలెట్టారు. ఆల్ ద బెస్ట్ టు రాహుల్ అండ్ మసూద హోల్ టీమ్... అని అన్నారు.
చిత్ర నిర్మాత రాహూల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ.. “ముందుగా దిల్ రాజుగారికి థ్యాంక్స్. రాజుగారిది చాలా మంచి చెయ్యి.. నాది కూడా మంచి చెయ్యి.. రెండు మంచి చేతులు కలిస్తే గట్టిగా సౌండ్ వస్తుందని భావిస్తున్నాను. ముందు ముందు మరిన్ని మంచి చిత్రాలు మా ద్వారా రావాలని కోరుకుంటున్నాను. మసూద విషయానికి వస్తే.. 3 సంవత్సరాల కష్టమిది. మధ్యలో కోవిడ్ రావడంతో ఆలస్యమైంది. మొదటి నుంచి నేను చెబుతున్నట్లుగా.. కొత్త డైరెక్టర్స్‌ని 5గురుని పరిచయం చేస్తున్న తరుణంలో.. ఇప్పుడు 3వ దర్శకుడు సాయికిరణ్‌ని పరిచయం కాబోతున్నాడు.
ఈ సినిమాకి ఎందరో టాలెంటెడ్ పర్సన్స్ వర్క్ చేశారు. మధ్యలో వేరే అవకాశాలు వచ్చినా వెళ్లకుండా.. ఈ సినిమా కోసం 3 ఇయర్స్ కష్టపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీరు అంతగా నిలబడ్డారు కాబట్టే.. ఇంత మంచి సినిమా తీయగలిగాను. మంచి సినిమా అని ఎందుకు అంటున్నానంటే.. ఇంతకు ముందు నేను తీసిన రెండు సినిమాల విషయంలో నా టేస్ట్ ప్రేక్షకులకి నచ్చింది. ఆ నమ్మకంతో ఇది కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. నాకీ అవకాశం ఇచ్చిన రాజుగారికి థ్యాంక్స్. ఆయన నమ్మకం నిలబెట్టుకుంటాననే హోప్ అయితే నాకుంది. బుధవారం సాయంత్రం సోనీ మ్యూజిక్ ద్వారా ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేయబోతున్నాం. సినిమా నవంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.. అందరికీ థ్యాంక్స్ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో హీరో తిరువీర్, హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్, బాందవి శ్రీధర్, సంగీత దర్శకుడు ప్రశాంత్, సినిమాటోగ్రాఫర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.