1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2024 (14:37 IST)

ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ!!

srikalareddy
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ పోటీ చేస్తున్నారు. జౌన్‌పుర లోక్‌సభ స్థానం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈమె మాజీ ఎంపీ ధనుంజయ్ సింగ్ మూడో భార్య కావడం గమనార్హం. ధనుంజయ్ సింగ్‌కు ఓ కేసులో జైలుశిక్ష పడింది. దీంతో ఆయనపై అనర్హత వేటు పడటంతో తన తరపున మూడో భార్య శ్రీకళారెడ్డిని బరిలోకి దించారు. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ తరపున ఆమె జౌన్‌పుర నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. 
 
తెలంగాణాలోని నల్గొండ జిల్లాకు చెందిన శ్రీకళారెడ్డిని ధనుంజయ్ సింగ్ మూడో పెళ్లి చేసుకున్నారు. ఈయనకు జైన్‌పుర నియోజకవర్గంలో మంచిపట్టుంది. అయితే, ఓ కిడ్నాప్, అక్రమ వసూళ్ళకు సంబంధించిన కేసులో ఆయనకు కోర్టు జైలుశిక్ష విధించింది. దీంతో చట్టప్రకారం ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తన మూడో భార్య శ్రీకళారెడ్డిని బరిలోకి దించారు. 
 
హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా, నల్గొండ జిల్లా కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా సేవలందించిన కె.జితేందర్ రెడ్డి కుమార్తెనే ఈ శ్రీకళారెడ్డి.. ఆమె తల్లి లలితారెడ్డి గ్రామ సర్పంచిగా సేవలందించారు. నిప్పో బ్యాటరీ కంపెనీ జితేందర్ రెడ్డిదే.. ఈ వ్యాపారం కారణంగా శ్రీకళారెడ్డి చిన్నతనంలో ఆమె కుటుంబం చెన్నైలో నివసించింది. ఇంటర్ దాకా చెన్నైలో చదివిన శ్రీకళారెడ్డి.. హైదరాబాద్ నగరంలో బీకామ్ పూర్తిచేసి అమెరికా వెళ్లారు. అక్కడ అర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సును పూర్తి చేశారు. తిరిగొచ్చి కుటుంబ వ్యాపారాలను చూసుకున్నారు. 2017లో ధనుంజయ్ సింగ్, శ్రీకళారెడ్డిల వివాహం పారిస్‌లో ఘనంగా జరిగింది.
 
కాగా, అప్పటికే ధనుంజయ్‌కి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య చనిపోగా రెండో భార్య విడాకులు తీసుకుంది. వివాహం తర్వాత శ్రీకళారెడ్డి యూపీలో భర్తతో కలిసి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గానూ సేవలందించారు. తాజాగా, జౌన్‌పుర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరపున లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. కాగా, తనకు రూ.786.71 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు, రూ.1.74 కోట్ల విలువైన నగలు ఉన్నట్లు శ్రీకళారెడ్డి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.