శుక్రవారం, 21 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 ఏప్రియల్ 2021 (14:57 IST)

"రా" ఏజెంటుగా కాజల్ అగర్వాల్

ఇటీవలే వివాహం చేసుకున్న టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్... తన కొత్త చిత్రంలో రా ఏజెంటుగా నటించనుంది. ప్రవీణ్‌సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పవర్‌ఫుల్‌ యాక్షన్‌ అంశాలతో తెరకెక్కుతోంది. ఇందులో ఈ అమ్మడు ‘రా’ ఏజెంట్‌గా శక్తివంతమైన పాత్రను పోషిస్తోందట.
 
దేశ రక్షణ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడే ధీశాలి అయిన మహిళగా ఆమె పాత్ర స్ఫూర్తివంతంగా సాగుతుందని చెబుతున్నారు. ఎంతటి భావోద్వేగాలనైనా తనలోనే అణచుకుంటూ దేశభక్తితో వృత్తినే దైవంగా భావించే గూఢచారి పాత్రలో ఆమె నటన సినిమాలో ప్రధానాకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. 
 
కాగా, కాజల్‌ కెరీర్‌లోనే సవాలుతో కూడుకున్న పాత్ర ఇదని.. దీనికోసం ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని చిత్ర యూనిట్ అంటోంది. ఇటీవలే ఈ చిత్రం గోవాలో ఓ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. తదుపరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో చిరంజీవి సరసన ‘ఆచార్య’ చిత్రంలో కూడా కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం తెల్సిందే.